పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

49


(14)

కర్మయోగమే యజ్ఞము.

(గీత: అధ్యాయములు 4, 5, 6.)


వేదములో యజ్ఞముచేయవలెనని విధింపబడియున్నది. యజ్ఞము లేక వేల్మిలోని ముఖ్యాంశము త్యాగము. స్వార్థమును ఆశను వీడుటయే యజ్ఞసారము. కావున వేల్మి అను నది పలువిధముల జేయగూడిన దైవపూజ. ఇట్లు పలువిధ ముల జేయబడిన హోమములకు వేదములలో జెప్ప బడిన ఫలముండును. మోక్షమును గోరువాడు కార్యమును జేయుట విడిచిపెట్టి యూరకుండవలెనని తలపక, తప్పక సకల కార్యములను యజ్ఞముననే చేసికొని విముక్తినిజెందవచ్చును. స్వార్థమును విడిచి చేసినకర్మ మొక యజ్ఞమే యగును.


యజ్ఞశిష్టామృతభుజో యాన్తి బ్రహ్మ సనాతనం
నాయంలోకో౽స్త్యయజ్ఞస్య కుతో౽న్యః కురుసత్తమ.


హోమము చేయగా మిగిలినది అమృతమగును. దానిని సేవించువారు మరణములేని పరమపదమును పొందుదురు. వేల్వనివారి కీలోకము లేదు. ఇక వారికి పరలోక మెక్కడిది! 4-31