పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చున్నాము. దాని యొకకొమ్మవలె మరియొక కొమ్మలేదు. చూచుట కధికభేదములు కనబడును; కాని అన్నిటికి నొక్కడే జీవము. వ్యత్యాసములను చూచి భ్రమ చెందగూడదు.

భగవద్గీత యనునది హిందూమతమున నందరును నొప్పుకొని గౌరవించుగ్రంథము. దాని నన్ని సాంప్రదాయము లకు జెందినవారును శాస్త్రముగ నంగీకరించియున్నారు. ఈ భగవద్గీతనుండి రెండు ముఖ్యములైన విషయములవలన హిందూమతము క్రొత్తకళను పొందినదని చెప్పవచ్చును. ఒకటి, కేవలము యాగాదిక్రియలకు అనగా వైదికయజ్ఞ మార్గమునకు ప్రాధాన్యము నిచ్చునది. రెండవది త్యాగ మార్గ మొక్కటే మోక్షసాధన మను నభిప్రాయమును స్థిర పరచునది. జీవితమునకు కావలసిన కార్యములను చేసియే ధర్మమును నిలుపవచ్చునను సత్యమును గీత చక్కగా చాటు చున్నది. సంఘక్షేమమునకు వలసిన కార్యములను జేయుచుండ వలెననియు, ఆకార్యములలో వాడువాడు తన కేర్పాటు కాబడిన పనులను సరిగభగవత్ప్రీతిగ చేసినయెడల మోక్షమున కడ్డమేర్పడదనియు, అదియే కర్మబంధమునుండి విడబడుటకు మార్గమనియు గీత యొత్తి యుపదేశించుచున్నది.

ధర్మమార్గమున నిలుచువాడు తనకు సంఘములో నేమిపని యేర్పడియున్నదో దానిని చక్కగా జేయవలెను.