పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కర్మవిధి. హిందూధర్మమున నడగియున్న సిద్ధాంతమిది. కారణ కార్యముల నిరంతరసంబంధముమీదనేర్పడిన సిద్ధాంతమిది. కారణమునకు కార్యము సమము. కారణము ఫలమునివ్వక తప్పదు. కారణమునకు మరురూపమే ఫలము. కావున దేహ వియోగము తరువాతను నాత్మయున్నదనిన నది తాను చేసిన చేతలఫలమును గ్రహించియే యుండును. ఇదియే కర్మవిధి. 'ఇన్సాల్వెన్సీకోర్టు'లో అప్పులను రద్దుచేసి విడుచునట్లు కర్మ విధిలో పొసగదు. ప్రాతయప్పులను తీర్చియే తీరవలెను.


(10)

కర్మఫలము.

ఒకకొలనిలో నొక రాయివేసిన నది నీటిని కలతబెట్టి యలలను గలిగించును. ఎంతటి చిన్నరాయియయినను దాని వేగమునకును భారమునకును తగిన యలలను కలిగించును. ఆకలత కంటికి కనబడనంత చిన్నదైనను దానివేగముచే నలలేర్పడి యొడ్డును తాకును. ఒకయల మరియొకయలను విరుచును. ఒకదానితోనొకటి కలిసి పెరుగుటయు క్రుంగుటయు కలదు. కావున నెంతటి చిన్న చలనము వ్యర్థముకాదు. ఈవిధముగనే మనచేతలును ఆత్మకు చెందినంతమట్టుకు మన స్సున నుదయించు కోరికలును ఆశలును చేతలే యగును.