పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మతాచార్యులు భాష్యములు చేసియున్నారు. ఉపనిషత్తులను నిట్లే మూడువిధములగు సిద్ధాంతములకును నెడమిచ్చును.

జీవాత్మకును పరమేశ్వరునికి నేమి సంబంధమను విషయమున అభిప్రాయభేదములున్నను, మూడువిధములగు సంప్రదాయములందును కర్మవిధి యొప్పుకొనబడుచున్నది. అనగా జీవుడు కర్మవిధియందు బద్ధుడై నిలిచియున్నాడని యభిప్రాయము.

ఇంద్రియములును, ఇంద్రియములను నడపించు మనస్సును ఈ యారింటిని పొందినది దేహము. ఇదే జీవునికిల్లు. ఈయిల్లు అచేతనభూతప్రకృతిచే చేయబడినది. ఒక దేహమును ధరించునాత్మ యాదేహముతో విషయముల ననుభవించుచున్నది. చేష్టలన్నియు గుణములుగా మారగా నాగుణము లాత్మలోకలిసి నిలుచుచున్నవి. ఒక దేహమును విడిచి వేరు దేహమును ధరించునప్పుడు పూర్వజన్మమున పొందిన కర్మఫలములాత్మనంటిపెట్టుకొని నిలుచును. ఇదేక్రొత్త దేహపు మూలధనము, లేక గుణము. ఒక శరీరమును విడిచి, బయటికిపోవు నాత్మ యాదేహములో పొందిన గుణములను గొనిపోవుచున్నది. వానితో క్రొత్తదేహములో ప్రవేశించు చున్నది. గాలి యొకతోటమీదుగా వీచుచు నక్కడనుండు పరిమళమును గ్రహించుకొని పోవునట్లే, యాత్మయును తా నెత్తిన జన్మములో కర్మములను సూక్ష్మరూపమున కొనిపోవు చుండును.