పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గీతాసంగ్రహారంభము

(8)

(ఆత్మ)

(గీత:- అధ్యాయములు - 2, 13)

జీవుడు, జీవాత్మ, ఆత్మ, దేహి అని చాలపేళ్ళతో పిలువబడు వస్తువొకటి దేహములో దేహమునకు యజమానియై వాసముచేయునను తత్త్వమును మొదట మనము తెలిసికొనవలెను. కంటికగపడు దేహముమాత్రము సత్యము, అదితప్ప మరియేదియు లేదని యెంచుట తప్పు. జీవు డింద్రియములకు గోచరింపడు; అయినను దేహములోపల నంతటను వ్యాపించి, యంతను నడిపించుచు ననుభవించుచు వచ్చుచున్నాడు. మనుష్యునికుండు బుద్ధివేరు; ఆత్మ వేరు. చైతన్యము, ఆలోచన, ఆశ మొదలగు మనోభావములు, నిదానబుద్ధి, వివేకము, ఇవి యెల్లను మనుష్యుని దేహమునకు సంబంధించిన స్వాభావికములయిన వ్యాపారములు. ఇవియే ఆత్మ కావు. వీనినెల్లను విడిచి, వానికి వెనుక నిలిచియున్నది యాత్మ.

ఆత్మ శరీరమునందంతటను వ్యాపించియున్నది. కడుపు లోనో, గుండెలోనో, తలలోనో మాత్రముండునది కాదు.