పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మునకును మీకు దానిమీద మక్కువ యెక్కువ కాగలదు. గీతాశ్లోకపఠనము కష్టములలో మీ కాధారము కాగలదు, దుఃఖములోను, ఏకాంతకారాగారవాసములోనుగూడ, మిమ్మోదార్పగలదు. ఈశ్వరాజ్ఞయై ప్రాణములను విడువవలసి నప్పూ డీ గీతాశ్లోకములను పెదవులతో స్మరించుచు విడిచిన యెడల బ్రహ్మనిర్వాణము సిద్ధింపగలదు. ఆ బ్రహ్మనిర్వాణ మన నేమో మీ యాచార్యులువారు బోధింపగలరు.

__________


అనుబంధము 2.

గీత: దివ్యఫలము.

(లోకమాన్య బాలగంగాధరతిలకు).


ప్రపంచవాఙ్మయమంతటిలోను గీతవంటి గ్రంథము లేదు. మిక్కిలి యుత్తమకాంతిగల వెలలేని రత్నము. అది దుఃఖాత్ములకు శాంతినిచ్చును; మనల నధ్యాత్మ విద్యా సంపన్నులను జేయును. వేయేల? సనాతన కాలగర్భమున నడగియున్న సత్యములను మనకు తెలుపగల గ్రంథ మొక్క గీత తప్ప, ప్రపంచభాషలలో దేనిలోను మరియొకటిలేదు.