పుట:Srikrishnudu-Choopina-Maargamu.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇట్టిభేదము నెంచుటకు వీలులేదు. ఇది సర్వకాలములకును, సర్వసంఘపద్ధతికిని అన్వయించును. ప్రాచీనకాలమందలి వర్ణ సంస్థ రష్యాలో నడచుచు వచ్చుచున్న సామ్యవాదపద్ధతికిని సమానముగ నన్వయించును. నిప్పులో పొగయున్నట్లు లోకములో చేయగూడిన యెల్లపనులందును దోషము కనబడును. ఏపనినైనను పవిత్రము చేయగల యొక భావనగలదు. తనకు లాభమునో, సుఖమునో వెదుకక, సంఘజీవనమునకు మేలు చేయుదునను మనోభావమది. అదియే సకలకల్మషమును పోగొట్టగల గంగాతీర్థము. ఇదియే గీతావాక్యపు ముఖ్యాంశము. ఆకాలమున జాతి క్రమముగ పని విభజింపబడియుండుటవలన మంచి ముఖ్యతత్త్వమును స్పష్టముచేసి, యుపదేశము వ్రాయ బడియున్నది. అయినను నీతత్త్వము పని నేవిధముగ విభాగముచేసినను నన్వయించును. ఉన్నగోడమీద చిత్రము వ్రాయబడును. పటమును గమనింపవలెనేగాని గోడకూర్పు కాదు గమనింపవలసినవిషయము. ఆకాలమున నాచారము లోనున్న పద్ధతులను రూఢిగనున్న సంఘరచనాక్రమమును మనస్సున నుంచుకొని, యేయుత్తమ సమత్వతత్త్వము బోధింపబడినదో, యాతత్త్వమును బాగుగ తెలియవలయును.


స్వే స్వే కర్మ ణ్యభిరతః సంసిద్ధిం లభ తే నరః
స్వకర్మ నిరత స్సిద్ధిం యథా విందతితచ్ఛృణు.