పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

214 సాహిత్య మీమాంస

తపోవ్రతధారులై యత్నించేవారే. వారిప్రకర్ష చక్కగా కనబడుటకు వారిప్రక్కనే దైత్య దానవ రాక్షసుల చిత్రము లమర్చబడ్డవి. ఈ పాపచిత్రములు కూడ మానుష చిత్రములే కాని వాటిలో అరిషడ్వర్గము అత్యధికముగా చెల రేగింది. ఇంద్రియవశుడైన మానవుడు సంయమము కోలుపోవడము వానికి స్వేచ్ఛాచరణము స్వాభావికము కావడమున్నూ దానవచరితములందు స్పష్టమగును. ఆర్యసాహిత్యమున చిత్రితులైన స్త్రీపురుషులను నాలుగు తెగలుగా విభజింప వచ్చును : _ దేవతలు - ఋషులు - మనుష్యులు - దానవులు.

ఈ మనుష్యచిత్రములే యథార్థమైన మానవపాత్రములు. అంతశ్శత్రుప్రాబల్య విశిష్టమగు సాధారణమానవచరితముల కన్న అవి ఉత్తమములు. అందు క్రమముగా దేవత్వము వికాస మొందును. వారు ఇంద్రియ నిగ్రహముచేత చిత్తైకాగ్రతను సాధించి విశ్వప్రేమ నతిశయింప జేయుదురు. దేవతలున్నూ సంసారులే, వారికీ పుత్రమిత్రకళత్రాదులు కల్పింప బడ్డారు, సంసారులైనావాళ్లప్రేమ విశ్వవ్యాపిని కావడముచేత వాళ్ళెప్పుడూ విశ్వరక్షణమందు వ్యగ్రులై ఉంటారు. వాళ్ల చరిత్రలే మానవుల కాదర్శములు. ప్రేమను సర్వజంతువులకూ సమముగా పంచి యివ్వడమే దేవత్వము సాధించడము. ఇది కఠినవ్రతము, దీని ప్రభావముచేతనే ప్రేమభక్తిమిశ్రితమై పెద్దలందు ప్రవర్తించును. దీనినే పాశ్చాత్యులు Hero Worship అంటారు. పెద్దలు లోకాంతరగతులైన వెన్క