పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

197 దేవత్వము

బలిచేయవలెను. ఇది సులభమైన పని కాదు - పిమ్మట గురుజనమును సేవించుటవల్ల ప్రేమ పరార్థపరమై భక్తిగా పరిణత మవును. పసితనమునుండీ దేవతల నారాధించువారియెడ భక్తి గన్పరుస్తూ, త్రికరణశుద్ధిగా దేవతారాధనము చేస్తూ సర్వమున్నూ వారి కర్పించి అనురాగమంతా వారియందే నిక్షిప్తము చేయవలెను. "విశ్వమున కంతటికీ పతి సర్వేశ్వరుడు, మే మతనివారమ"ని అందరూ భావించవలెను. ఇట్టిపరార్థప్రేమకూ గురుజన సేవకూ నుతికెక్కిన దృష్టాంతములు శ్రీరాముడు, భీష్ముడు, ధర్మరాజు, తండ్రిని తనియించుటకు శ్రీరాముడు సింహాసనము వీడి వనములందు వసింపబోయెను; అట్టి సందర్భముననే భీష్ము డాజన్మబ్రహ్మచర్యవ్రతము సల్పెను - ధర్మరాజుకూడా పితృ సేవాపరాయణత చూపెను. కురుక్షేత్రసంగ్రామమున కులమెల్ల నశింప వృద్ధదంపతులగు గాంధారీధృతరాష్ట్రులను పోషించు భారము ధర్మరాజునిపై బడినప్పుడు వారి సత్యాదరముతో నాతడు గౌరవించెనని భారతమున నున్నది - ఇం దాతని ధర్మపరాయణత స్పష్టము కాలేదా? ఇట్టి యుదారచరితము ఐరోపీయులలో గాంచబోము.

7. ధర్మాచరణము.

గురుశుశ్రూషయందు ద్యోతకమైనట్లు దానధర్మముల యందున్నూ ప్రేమ ప్రకటిత మగును. వీటిమాహాత్మ్యము మన గ్రంథములయందు పుష్కలముగా కీర్తింపబడినది. వివిధదానముల నొసగుటచేత మానవుని హృదయము ఉదార మగును.