పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

182 సాహిత్య మీమాంస

ఇట్టి మైత్రిని సాధింపగలిగినందుకే గార్గి ఆత్మజ్ఞానోపదేశమున కహున్‌రా లయింది. పాతివ్రత్య మాచరించి దివ్యత్వము సాధించిన సతీమణి ముక్తినిదానమైన ఆత్మజ్ఞానమున కధికారము పొందగలదు. అందుకే పాతివ్రత్యము స్త్రీలకు ముక్తిమార్గమని మన శాస్త్రములు చెప్పుచున్నవి. పాతివ్రత్యము గౌణరూపమున ముక్తిసాధన మవుతుంది, పతియే సతికి ముక్తిసాధనము. ఇట్టి దివ్యాదర్శనమున కిప్పటి హిందూనారీమణు లెంతదూరమున నున్నారో కొంచెము పరికించండి. దివ్యాదర్శములను ధిక్కరించినవారు పతితులౌట సహజమే!

దేవతాదర్శము

ఉజ్వలమైన దేవతాదర్శ మెప్పుడూ మనస్త్రీల కళ్లకు కట్టినట్లుండును. లక్ష్మి, సరస్వతి, గౌరియూ నిట్టి ఆదర్శ దేవతలు. సిరుల తులతూగుచున్న స్త్రీ లక్ష్మివలె మార్దవము, ధైర్యము, పతిభక్తియూ అభ్యసిస్తూండును; బుద్ధిమతియైన స్త్రీ సరస్వతిని బురుడించును. గౌరివలె పత్యనురక్త లవుట కందరూ కోరుచుందురు. పతిపరాయణ, ధీర, శాంతస్వభావ సుశీలయు నగు నవలామణిని లక్ష్మియని గుణవతిని సరస్వతియనీ, అందరియెడ దయచూపి సాధ్విని అన్న పూర్ణయనీ భావిస్తూంటాము. దీనికి హేతువేమి? ఈ దేవతాదర్శములు మనహృదయఫలకములందు చెక్కియుండబడుటచేతనే గదా! నారీజనమునకు దివ్యత్వము సిద్ధించు సూక్ష్మమార్గము మహాభారతమున "నత్యాద్రౌపదీసంవాదమం"దు వివరింపబడింది.