పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

172 సాహిత్య మీమాంస

వస్తు వే లేదు. తనకబ్బిన రాచగద్దియ భరతుడు త్యజించలేదా? కురుక్షేత్రసంగ్రామమున నెంతో శ్రమపడి జయమునొందిన ధర్మజుడు సింహాసనాసీనుడగుటకు సమ్మతించెనా? వ్యాసుడు అతనికి వైరాగ్యమూ, ఇతరపాండవులకు జ్ఞానమున్నూ ఉపదేశించి అంతశ్శత్రువుల నరికట్టుట శ్రేష్ఠతమమగు కార్యమను విశ్వాస ముదయింపజేసెను. కావున పంచపాండవులు ద్రౌపదితోకూడా భోగసుఖములు త్యజించి సంసారము రాజధర్మమున్నూ నిర్వహింపవచ్చునని నిశ్చయించుకొని, జ్ఞానబలమే నిజమైన వీరత్వమని నమ్మిరి. ఈశక్తి మూలమున జితేంద్రియులై, చిత్తవశీకరణ నిపుణులై, జీవితము సార్థకమొనర్చువారికి భుజబలమున గాని, సైన్యబలమున గాని, సహాయసంపదయందుగాని యేలోటూ ఉండదు. వశిష్ఠవిశ్వామిత్రులు తమ తపో మహిమచేత తండోపతండములగు సేనలు కూర్చలేదా? ఇట్టి సామర్థ్యమున్నా విశ్వామిత్రుడు వశిష్ఠునితో సమానశక్తిశాలి కాలేకపోవుటచేత సంగ్రామమున జితుడై బ్రహ్మర్షి కావలెనని దృఢప్రతిజ్ఞచేసి తీవ్రమైన తపస్సువల్ల జ్ఞానబలము సంపాదించి బ్రహ్మత్వము పొందగల్గెను.

ఆదర్శ రాజ్యము

యుద్ధభూమిని ప్రాణములు బాసినవారికి వీరస్వర్గము లభించునని ఆర్యుల విశ్వాసము. అవసానకాలమున దుర్యోధనుడు కృష్ణునితో నిట్లనెను.