పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

170 సాహిత్య మీమాంస

భార్యనైన విడుచుటకు జంకక, యుద్ధమున నెట్టివా రెదుర్కొన్నా, ఓలమాసగొనక నడుముకట్టి నిలిచి, స్వధర్మానుసారము స్వదేశమునుగాని స్వరాజ్యమునుకాని రక్షించుకొనుటకు బభృవాహనునివలె తండ్రితోనైన తలపడి, కర్తవ్యనిష్ఠయు ధర్మానురక్తియు నిలువబెట్టుకొనునప్పుడున్నూ "మానవవీరత్వ" మగపడును. స్వదేశస్వధర్మ రక్షణార్థము ప్రాణముల నర్పించు భక్తులు (Patriots and Martyrs) మానవవీర్యమున నుజ్వల మూర్తులు. వారు మానవజాతికెల్ల గౌరవాపాదకులు.

ఆర్యవీర్యమందలి విశేషము

ఐరోపీయవీరులకన్న ఆర్యవీర్యుల ఆధిక్యత యేమి? వ్యాసు డీవిషయమును విశదముగా వర్ణించెను. పాశ్చాత్యేతి హాసమున గృహకలహముల వర్ణన మనము చదివియుందుము. కాని సమరసమయాన హృద్వేదనచేత అర్జునునివలె అస్త్రశస్త్రములను విడిచి యుద్ధవిముఖుడగు వీరుని అందు చూడము. యుద్ధోన్ముఖుడై కిరీటి వచ్చుసరికి ఎదురుగా భీష్మద్రోణాది గురుజనము సమరోద్యతమగుట చూడగానే, అతని మానసమున శ్రద్ధాభక్తులు ప్రబలమాయెను. యుద్ధమున కాహూతుడగునప్పుడు జంకుట వీరధర్మము కాదు, కాని గురుజనము, బంధుకోటితో పోరుట యుక్తకర్మ అగునా? అర్జునుని హృదయమున అంతర్యుద్ధము ప్రారంభమయ్యెను. బాహ్యయుద్ధమునకు కడంగుటకుముందు ఆంతరికసమర మంతయు కావలిసెను. వీరవరేణ్యుల కిట్టి సంశయ మెప్పుడైనా కలిగెనా?