పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

162 సాహిత్య మీమాంస

డైన కాసియస్ కసాయివానిలాగు చెల రేగి సీజరును చంపెను. "దీన నందరు వైరప్రధానమనరు, మనపని అవశ్యకర్తవ్య మనుచు దోచు"అని బ్రూటస్ సమాధానమిచ్చెను. ఇది సరిగా నున్నదా? సీజరును చంపకుండా దేశమునకు హితముకూర్చు మార్గములను అత డాలోచింపనేలేదే! మొదటనే చంపనిశ్చయించి పిమ్మట ప్రజల కెట్లు సమాధాన మివ్వవలెనో ఆలోచించుకొనెను. ఇట్టియెడ రక్తపాత మావశ్యక మని నిర్ణయించడ మేలాగు? కావున ఈరక్తస్రావ మవశ్యంభావి కాదు, అది బలి యనుట వట్టి భ్రాంతి.

ఇట్టివృత్తాంతములే గ్రీకువియోగాంతనాటకములకు ఉత్పత్తిహేతువులు. ధర్మార్థము బలి నొసంగడమే ఆధారము చేసుకొని వియోగాంతనాటకము లుత్పన్నము లాయెను. ఈస్కైలస్, యూరిపిడీస్ అను గ్రీకుకవుల నాటకము లిట్టివే. థర్మార్థము బలినొసంగుట ధర్మగౌరవహేతువనే వారి యూహ - అట్టి బలి నొసంగకూడ దని ఆర్యసాహిత్యమూ అనదు. కర్ణుడూ శిబిన్నీ ఆత్మజులను బలియిచ్చుటకుకూడా వెనుదీయలేదు - ఇట్టిసందర్భముననే మయూరధ్వజుడు తన దక్షిణబాహువును అతిథికి కోసియిచ్చెను. ఇట్టి రక్తపాతము మనసాహిత్యమున మాయాకల్పిత మనబడును. ఇందు బలియైనవారు పునర్జీవులైరి - థర్మమునకు గౌరవ మాపాదించడము కోసము భగవద్భక్తి నభివృద్ధిచేయడమునకూ ఇట్టి అలౌకిక వ్యాపారములు మనపురాణములయందు కల్పింపబడినవి. వీటి