పుట:Nanakucharitra021651mbp.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యవి యన్నియు నిష్ఫలము లయ్యెను. భాగో శేజిఖానున కాప్తుడగుటచే ఖాను తనకుమారుని దేహస్థితి నాతనితో జెప్పుకొని శీఘ్రముగ నేదో చికిత్సజేయనిపక్షమున బుత్రుడు తనకు దక్కడని బిట్టువిచారించెను. భాగో వానివిలాపము విని మేటివైద్యుల చికిత్సలు నిష్ఫలములైనందున నటమీద జికిత్సల జేయింపక భగవద్భక్తుడై పరమపవిత్రుడై మహిమలు చేయగల యోగినెవ్వనినైన బిలిపించి మంత్రబలముచే రోగమును శరీరమునుండి నిర్మూలము చేయుట కర్తవ్యమని వాని కుపదేశించెను. ఆయాలోచనము మిక్కిలి బాగున్నదని ఖాను మెచ్చుకొని నిజముగా వాక్శుద్ధిగలవాడు మహిమగలవాడు నగుయోగిదొరకుట సులభసాధ్యము కాదని పలికెను. అనవుడు నగరనుందున్న బైరాగుల సన్యాసుల యోగులనందఱ బట్టి తెప్పించిన పక్షమున నందులో నెవ్వడైన నొక్క మహాత్ముడుండకపోడని భాగో ప్రత్యుత్తరమిచ్చెను. ఆయుపదేశము లెస్సగానున్నదని మెచ్చి ఖాను కానబడిన విరాగులనెల్ల బట్టుకోమని సేవకుల కానతిచ్చెను. అట్లుపట్టుపడిన వారిలో గురునానకుకూడ నొకడైయుండెను. రాజభటులు గురునానకును నిష్కారణముగ బట్టుకొని తీసుకొని పోవుచున్నందుకు లల్లో చాలవిచారించెను. గురునానకు తనకు శిష్యుండగు పేద వడ్రంగినూరడించి తనయాత్మబంధములో లేనంతకాలము శరీరము బంధింప బడినను బాధల నొందినను తనకుజిజ్ఞాసలేదని పలికి వానికి ధైర్యము చెప్పెను.