పుట:Nanakucharitra021651mbp.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సమున నట్టిప్రజ్ఞ వానికి గలినదనియు గొందఱునుచున్నారు. కొందరు మర్దనునకు సహజముగా గానమునం దధికప్రజ్ఞగలదని చెప్పుదురు. నానకు మైమరచిపడుట మర్దనునియొక్క గానప్రభావముచేత గాక వాని హృదయమున నున్న భక్తిరసముచేతనే యని కొందఱు పలుకుదురు. ఈమాటయే కొంతవఱకు నిజమని తోచుచున్నది. భక్తిరసములేని శుష్కహృదయుడు రాళ్ళ గరగించు పాటలు వినినను పరవశుడైమూర్ఛిల్లునా? సహజముగా హృదయము భక్తి పూరితమైనప్పుడు స్వల్పగానము సహితము వాని కుత్సాహము గలిగించును. అంతేకాని తాంబురా కొయ్యలు నోటిపాటలు భక్తిలేనివానికి భక్తి సృష్టింపలేవు.

నానకు రెండుదినములు మూర్ఛావస్థలోనుండి మూడవనాడు కన్ను దెరచి చూచెను. గురువునకు మెలకువ వచ్చినతోడనే మర్దనుండు స్వగ్రామమునకు బోవుటకు సెలవిమ్మనియడిగెను. నానకు కారణముం దెలియగోర మర్దనుడిట్లనియె. "మీరు మూర్ఛవోయి రెండేసి దినము లీ ప్రకారముగా నున్న పక్షమున నాపనియేమి కావలయును? ఆకలిచేత దాహముచేత నేను చచ్చిపోనా! కావున నన్ను బోనిండు." శిష్యుని బేలమాటలు విని గురు విట్లనియె "నీయిష్టము వచ్చినట్లు చేయవచ్చును. నీవు స్వగ్రామమునకు బోయి సుఖించినను సంతోషమే నన్ను గనిపెట్టుకొనియున్నను సంతోషమే,