పుట:Nanakucharitra021651mbp.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తన కేమియు దోచక పిచ్చియెత్తినట్లున్నదనియు సెలవయ్యెనేని తాల్వెండికి బోయి వ్యవహారములం జక్క బెట్టుకొని మున్ను చేయదలంచిన పని జేయవచ్చుననియు బదులు చెప్పి నానకుచేసిన పని చాల మంచిదని పొగడి యతండు త్రొక్కినత్రోవ తప్పన్న వారిని నిరసించి తనకు నానకునందు బరమభక్తి గలిగింపుమని భగవంతుని బ్రార్థించెను. నానకు వాని భక్తికిమెచ్చి తాల్వెండికి బోవుటకు వానికి ననుజ్ఞ నిచ్చెను.

అనంతరము నానకు సోదరివద్ద సెలవు బుచ్చుకొని నిజనివాసమగు గోరీలదొడ్డికి బోయెను. మర్దనుడు తాంబూరా గొనుటకు బజారున కరిగెను. బజారులో నెక్కడవెదకిన నొక్క తాంబురా యైనం దొరకలేదు. దొరకకపోవుట యటుండగ వాని యుద్దేశమెఱిగిన పడుచువాండ్రందఱు వానిని జూచి యెగతాళి చేసిరి. మర్దనుడు బజారంతయు దిరిగి తిరిగి విసికి వేసారి నానకుకడకు బోయి తాంబురా దొరకకపోవుటయు దన్నెల్లవారు బరిహసించుటయు లోనగు వృత్తాంతమెఱింగించెను. నానకు వానిపలుకులు విని యిట్లని యూరడించె. "ప్రపంచమంతయు నజ్ఞానాంధకారమున మునిగి యున్నది. ఇప్పుడు లోకము మనల నిరసించినను ముందుముందు పశ్చాత్తాపముతోడను వినయముతోడను, మన మాటల నాకర్ణించును." ఈశ్వరునియందు గాటముగ మనస్సు నిలిపిన పరమ