పుట:Nanakucharitra021651mbp.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యెఱుగనిదిగావున నామె దు:ఖమున కూరటయే లేకపోయెను అయినను కుమారుని స్థితి యున్న దున్నట్లు తెలిసికొని రమ్మని గాళుడు మర్దనుడను గాయకుని సుల్తానుపురమున కంపెను. మార్గమున మర్దనున కెదురుపడిన మొదటిపురుషుడే యావార్తనిజమని పలికెను. అప్పటికిని మర్దనుని మనసు సందేహపరవశమగుటచే సుల్తానుపురమునకు వచ్చినతోడనే జయరాముడు వానిసందేహమును దీర్చెను. ఆదూత యంతతో దనివి నొందక నానకును స్వయముగా జూడవలయునని కోరి గోరీలదొడ్డికిబోయి యాతనిం గాంచి మరల గృహస్థాశ్రమస్వీకారము జేయుమని వాని కెన్నెన్నో యుపదేశముల జేసెను. ఈతడు తాల్వెండినుంచి వచ్చినప్పుడు తన వాక్చమత్కృతిచేత నానకు మనసు గరిగించి గృహస్థుంజేయ గలిగినట్లు కాళునితో బ్రజ్ఞలు పలికివచ్చె అందుచేత నతడు తన యావచ్ఛక్తి వినియోగించి నానకుం ద్రిప్పజొచ్చెను. అయ్యిరువుర కలయికచేత నానకు గృహస్థాశ్రమము స్వీకరించలేదు గాని నానకు చేసిన వేదాంతబోధలచేత మర్దనుడు సంసారముమీద విరక్తుడై తాల్వెండికి బోయి కాలునకు గుమారుని యవస్థయైనం జెప్ప దలపక నానకునకు శిష్యుడయ్యెను. ఊరక శిష్యుడైయుండక నానకు కంఠములో బ్రాణముండినంత కాలము పరమభక్తుడై తోడు నీడ యట్లు వానిని సేవించెను.