పుట:Nanakucharitra021651mbp.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దించినప్పుడు భగవద్భక్తులకు స్వార్జితమున జాలభాగము దానము చేయుచువచ్చెను. దాతయెల్లప్పుడు భగవంతునకు సమీపవర్తియై యుండునుగదా! పూర్వోక్త విషయములంబట్టి నానకు సాంసారమం దున్నపుడె మోహపాశబద్ధుడు గాడనియు నిర్మలాంత:కరణముగలవాడనియు, బరమభక్తుడనియు, నిస్పృహగలవాడనియు మనము గ్రహింపవచ్చును. అట్టి గుణములుండుటచేతనే విరక్తిదోచినతోడనే యతడు సంసారము నవలీలగ విడువగలిగెను.

మూళుడు తనయల్లుడు విరాగియైపోయెనని విని తద్దయు విషాదమంది పిడుగడచిన వాని చందమున తొలు దొల్తనిశ్చేష్టుడయ్యెను. తెలివివచ్చినపిదప నతడు మహాకుపితుడై యల్లుండుదారపుత్రులను నిరాధారులజేసి సన్యసించుట దుష్కార్యమనియు సంసార నాశహేతువనియు నభిప్రాయపడి యల్లుడుద్యోగము సేయునపుడైన నించుకధనము నిలువచేయకపోవుటచేతను కూతుసంసారము బిడ్డలు పాపలు గలిగి పెద్దదగుటచేతను దానిపోషణ మేవిధంబున జరుగగలదని బెంగపెట్టుగొనియె. తనకున్న సొత్తులోనుండి కూతునకేదేని గొంత యియ్యవలయునన్న దనసంసారము దీనస్థితిలోనేయుండెను. నానకు మొదటినుండియు నెవ్వరితో మాటలాడక నొంటిగగూర్చుండి ప్రపంచముమీద నసహ్యపడునట్లు గానబడుచువచ్చెనుగాని యతడంతలో నంతపని చేయునని మామగారెన్నడు