పుట:Nanakucharitra021651mbp.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుందురుగదా" యని తలంచుచుండును. అల్లునియూరికి మామయూరికి దూరముండుట మంచిదనయే కాబోలు శాస్త్రకారకులు సయితము "గృహస్థులు పుత్రికలను దూరప్రదేశములనుండు పడుచువారి కీయవలయి"నని శాసించిరి. నానకునకు గృహము సుఖప్రదమగుటకు మారుదుంఖబాజన మయినందున నత డింటనుండినప్పుడు ముండ్లకంపమీద నుండినట్లుండి మెదుకులు నోటవేసుకొని యావలకు బోవుచుండును. సోదరీ గృహమునకు బోవదలచిన వానియత్త యామెయింటికిగూడ బోయి యల్లునిమీద విధివిరామము లేక నేరములు చెప్పుచువచ్చెను. నానకి సాధుశీల యగుటచే దనసోదరుడు యోగ్యుడని యామె యెఱింగియుండియు నా గయ్యాళిగంప నోటికి వెరచి యేమియుననక యూరకుండును.

వేయిమంది పడుచు పడతులైనను నానకి యత్తగారి యెదుట నిలువలేరు. అట్టి యామెయెదుట పరమసాధ్వియగు నానకి నిలిచి యేమిప్రతిఘటింపగలదు. స్వగృహమునందుగాని సోదరీగృహమందుగాని యించుకేనియు మనశ్శాంతినొందుటకు వీలులేక నానకు దుకాణమే యిల్లుచేసికొని దినమునం దెనిమిది జాములలో జాలభాగ మక్కడనే గడుపుచు వచ్చెను. అతనికి బలుడు సహాయుడు బలున కతండు సహాయుడు. అతడొంటిగ గూర్చున్నప్పుడు మనసులో ననేకాలోచన లొకదానివెంబడి నొకటి తోచుచుండును. భార్యా దు:ఖ