పుట:Nanakucharitra021651mbp.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుమీద కూడగిట్టనివారు కొందఱున్నారు. ఇదియంతయు నామహాత్ముల సృష్టియేకాని మావాని లోపమేమియు లేదు" పరీక్షానంతరమున నవాబు నానకుమీద నెక్కువ విశ్వాసము గలవాడై మునుపిచ్చిన సొమ్మునకు దోడుగ పెట్టుబడి క్రింద మరిమూడువేల రూపాయల నిచ్చి వ్యాపారమునెక్కుడుగ సాగించమని చెప్పెను. నానకు నిర్దోషియని తెలిసినప్పుడు జయరాముడు వానిభార్యయు నొందిన యానంద మింతింతయని వర్నింప నలవికాదు. ఆపరీక్షవలన నవాబునకు నానకుమీద నమ్మిక పొడముటయేగాక జయరామునిమీదకూడ నధిక గౌరవము గలిగెను. కుబుసమువిడచిన కోడెత్రాచుననుకొన్నది పూలదండయయినట్లు బావమరుదులనిద్దరిపయి నలిగి వారిం జెరుపదలచిన నవాబు పరమాప్తుడగుటచే నానకుమీద నిందలుమోపిన శత్రువులు సిగ్గుపడి నోళ్లు మూసికొనవలసిన వారైరి. నానకు మేలునే గోరునట్టి బరమమిత్రులు సంతోషపరవశులైరి. తనకుమారుడు బుద్ధిహీనుడనియు జిల్లిగవ్వయైన నార్జింపలేడనియు, గొరమాలినవాడనియు దలంచి వాని నింటనుండి వెడలనడచిన కాళుడు పుత్రుని మిత వ్యయము నిర్దోషిత్వము నవాబునకు వానిపై దయగలుగుట మొదలగు వార్తలు విన్నప్పుడు పొందిన సంతోషమనుభవైక వేద్యమేగాని వర్నన కసాధ్యము. మొదటి నుండియు నానకు మహాత్ముడగునని నమ్ముచుండిన రాయబులారు దానినివిని యెంతో సంతోషించెను.