పుట:Nanakucharitra021651mbp.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ళునిబిలిచి "నీకు నీకొడుకునకు నింకపడదు. పడనప్పుడు మీ యిరువురు బగవారివలె నొండొరులవిడువ దగదు. కావుననానకును మంచిమాటలుచెప్పి జయరామునికడకు పంపుము నీకోరికప్రకారము నీయింటనుండక పోవుటయు వీలున్నపక్షమున బాగుపడుటయు సంభవించు"నని హితోపదేశము చేసెను. కాళు డాయుపదేశమువిని యదిలెస్సగానున్నదని కనిపెట్టికొడుకుమీద నెంతకోపము వచ్చినను గడుపుతీపిచేత సంబంధము బొత్తుగావదలుకొనుట కిష్టములేక జయరామునివద్ద నున్నపక్షమున నెప్పటికైన నానకు బుద్ధితెచ్చుకొని బాగుపడితనవద్దకు వచ్చుట కవకాశముండునని తలంచి యప్ప బావల వద్దకు బొమ్మని పుత్రునికానతిచ్చెను. రాయబులారు నానకును మిక్కిలి గౌరవింపవలసినదనియు వానికి జూపిన యాదరము తనకు జూపిన యాదరముగ నెంచుకొందుననియు జయరామున కొకజాబువ్రాసి నానకు చేతికిచ్చెను. ఆజాబుపుచ్చుకొని నానకు విషాదపూరిత మనస్కుడై సుల్తానుపురమునకు బోయెను. ఎంతవారికైన దలిదండ్రులను జన్మస్థానమును విడుచుట కష్టముగదా? జయరాముండు లోకముతోడి పాటువాడు కాడు గావున వానికీవిథమగు జా బవసరమేలేదు. జయరామునికంటెను వానిభార్య నానకి సద్గుణముల దొంతి యగుటచేతను నామె కున్నంత సోదరప్రేమ సాధారణముగ లోకమునందెవరికి నుండక పోవుట చేతను నానకు యిలువెడలినతోడనే సుఖపడు కాలమువచ్చినదని మనమునమ్మవచ్చును.