పుట:Nanakucharitra021651mbp.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ

నానకు చరిత్ర.

ద్వితీయాధ్యాయము.

విద్యాబుద్ధులు నేర్చుకొనవలసిన కాలమున జనకుడు కుమారుని మనసువచ్చినట్లు దిరుగుమని చెప్పుట యసంభవమేయైనను గాళుడు పుత్రుని నతనముచేత విసిగి యట్లు చేసెనేగాని బిడ్డను బాగుచేయవలయునను తలంపు లేక కాదు. కాళుడు పండ్రెండవ యేట నానకును స్వేచ్ఛావిహారమునకై విడిసి దృడ మనోబలము గలవాడగుటచేత నైదేండ్లలోపున మరలనెన్నడు వానిపురోవృద్ధివిషయమై వానితో ముచ్చటింపక యైదేండ్లు గడచినపిదప ననగా నానకునకు బదునేడేండ్లు వయస్సు వచ్చినపుడు బుద్ధియేమైన మరలినదేమో చూడవలయునని కొడుకునొకసారి పిలిచి తాను మరణము నొందకమునుపే నేదైననొక మంచివృత్తి నేర్చుకొనుట మంచిదనియు దనమరణానంతరమున మొగమైన జూచువారుండరనియు వ్యవహారము నేర్చుకొనవలసిన యదను దాటినచో మరల గూడిరాదనియు నయమున భయమున జెప్పి కొడుకును బుజ్జగించెను.