పుట:Nanakucharitra021651mbp.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

న్ముక్తు లగు మహాత్ములు కారాబద్ధులయ్యు చెఱసాలలో సంపూణన్ స్వాతంత్ర్యము గలవారియట్ల సంతోష భరితు లై యుందురు. అజ్ఞానులు యథేచ్ఛముగ విహరింప స్వాతంత్ర్యము గలిగియు సంసారబద్ధులై కారాబద్ధుల కంటె నధికదు:ఖము లనుభవించు చుందురు. చక్రవతిన్ గురువుయొక్క శరీరమునే నాలుగుగోడల నడుమబంధించెను. కాని యాతనియాత్మను బాథింప జాలడు. శరీరము చెఱనుండి గదలలేకపోయినను విశృంఖలమైన యాత్మ రోదసీ కుహరమంతయు స్వేచ్ఛగా విహరించి పరమేశ్వరుని పాదములవఱకు బయనముసేయును. ఆ చెఱసాలలో నున్న ఖైదీలు ప్రతిదినము తిరగళ్ళతో గొంతపిండి విసరవలయునని నియమముండెను. కారాబద్ధు లాపని బహుకష్టమున జేయవలసి వచ్చెను. నానకు స్వధర్మముచేయుటయం డత్యంతాసక్తి గలవాడు కావునదక్కిన వాండ్రవలె రేలు పెందలకడ నిదురవోవక విసరవలసినపిండి యంతయు విసిరి శయనించుచు వచ్చెను. అది యెఱుగక తోడిఖైదీలు నానకుయొక్క శిష్యులు నానకునకు మహామహిమలు గల్పించి నానకు స్వహస్తముతో విసరనక్కఱలేకుండ నతని ప్రభావముచేత వాటంతటవే తిరుగళ్ళు తిరిగె ననియు భగవంతు డే వచ్చి విసరెననియు జెప్పుకొన జొచ్చిరి. మూడవిశ్వాసము గల యానాడు జనులందఱు నామాటలు నమ్మిరి. దైవానుగ్రహమువలన నానకు చిరకాలము చెఱలోనుండ