పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
108


నెంచక పిక్కబలంబుఁ జూపించిరి. ఆ వృత్తాంతమెఱింగియో యెఱుంగకయో తదభిమానులు కొందఱు బాపట్లలో నదివఱకు సోదర కవీంద్రులొనర్చిన యాశుకవిత్వావధానముల కన్న మిన్నగా నొనర్పఁజేసెదమని శ్రీ తిరుపతి వేంకట కవుల నాహ్వానముజేసి సభ గూర్చిరి. అందాశుకవిత్వము పేరెత్తినంతనే వారు తబ్బిబ్బుతో నేలవచ్చితిమి దేవుఁడాయనుకొని తమ కృత్రిమపు సభలు నేఁడు బైటపడునని కాలనేమియుక్తులతో నాశుకవిత్వమును దప్పించుకొని యవధానమను పేరుతో నొక సభఁగావించిరి. సోదరకవులపైఁ దమకుఁ బ్రతిగా గంటలుగట్టి కొంటిరఁట .... గెంటెదనని దూఁకిన శ్రీశివరామశాస్త్రిచే నాశుకవిత్వముఁ జెప్పింపఁదలఁచి ముందఱకు నెట్టి సభ్యులఁగథ కోరుకొనుండనఁగా సభ్యులు రామరావణ యుద్ధంబుఁగోరిరి. అంతట నా బాలకవి యీ కథలో మేటరులేదు. కావునఁ జెప్పుటకు వీలులేదనఁగా "జననంబాదిగా నేల చెప్పరా"దని వేంకటశాస్త్రి గారూత యొసంగిరి. అంతట నా శివరామకవిగారు, “రాళ్ళచేనిలో గుంటక డొల్లించి”నట్లు ప్రాసవిశ్రమముల దూరముగాఁ బాఱఁజిమ్ముచు నాశుకవిత్వమునఁ బ్రాసవిశ్రమము లవసరమ్ములేదని శాసనంబుఁ జేయుచు రసాభాసమొనర్చి గంటకుఁ బదియాఱు పద్యములనల్లిరి. వేంకటశాస్త్రిగా రంతటఁ దమ్ముద్ధరింప వచ్చెనన్న విశ్వాసమయినలేకుండ నిజమాడిన నిష్ఠురమనియైనఁ దలంపక “ఇఁక కధ నే గోదావరిలోనో గంగలోనో కలిపితివి” చాలులేయని పరిహసించిరి. శ్రీ తిరుపతి శాస్త్రిగారు, పిదపఁ దామొక గీతపద్యము మొదలుపెట్టిరి. అంతట వేంకట శాస్త్రిగారును గలిసి చెఱియొక పాదముగాఁ ......... చేయంగల విన్నపములనునట్లు చెప్పి శిష్యునకుం దమకుంగల తారతమ్యంబును నాశుకవిత్వంబునఁ దమకుఁగల ప్రజ్ఞయు సకలజనంబుల కెఱింగించిరి. అవధానమందైన సోదర కవులఁ బోలఁజాలరా యను తమవారి సంతోషమంతయు భంగము చెందునట్లు తొలి నాఁడవధానమునఁ ప్రశ్నములిచ్చిన పృచ్ఛకుల కసంతుష్టిగాఁ గొన్నియడిగిన ప్రశ్నములమార్చియుఁ గొన్ని వీలు లేదనియుఁ జెప్పి తమ చాకచక్యంబుఁ గనుపఱచిరి. వారవధాన సమయమునఁ జెప్పుటకు వీలులేదని విడచినవియుఁ, జెప్పినవియుఁ గొన్ని దిక్ప్రదర్శనముగా నీ క్రింద నుదహరించితిని.