పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

109

1. కరోమి, కవయామి, వయామి, యామి అను పదములనుకరణము లేకుండ మీయిష్టమువచ్చిన వృత్తములోఁ జెప్పుఁడన యుభయభాషా ప్రవీణులు, ఆంధ్రంబున నెక్కువ ప్రవేశముగలవారు చెప్పవలయుఁగాని మేము చెప్పలేము మాకశక్యమని దానిని వదలిరి.

2. ఈసోదరకవులచేఁ జేయఁబడిన యవధాన పద్యములలో 5, 11 పద్యముల తాత్పర్యమును మీయిష్టమువచ్చిన పద్యములుగాఁ జెప్పుడన నవియిప్పుడసాధ్యమని త్రోసివేసిరి.

3. రంభముగడుపారమెక్కె రవితాపమునన్, అనుసమస్యఁ బాడుచేసిరి.

4. దీపముతలమీఁదయీఁగ ధీరతవ్రాలెన్ - అను సమస్యను దీనతయని దిద్దికొనిరి.

5. దారము లేకున్న బ్రతుకఁ దరమే మనకున్ - అను సమస్యను ధారము అని మార్చిరి.

ఇట్లెట్లో అవధానమంతమందిన మీఁదట మరలఁ బద్యములఁ జదువుఁడని సభ్యులు కోరిరి. అంతట భోజనమొనర్పఁ బ్రొద్దుపోయినదనియు, నవధానాంతమున బద్యములు చదువకున్న లోపము కాదనియు, వేంకటశాస్త్రిగారు చెప్పిరి. అందుల కొడంబడక సభ్యులు చదువుఁడని మరలఁగోరఁగా నమస్కార బాణములచేఁ దప్పుకొనుట తటస్థించెను.

ఈ విధముగా నాసభలో వారు సభ్యుల యనుగ్రహమునకై ప్రార్ధించిన ప్రార్ధనము లిందు వివరింపఁ బడవు, కాని సోదరకవీశ్వరులను మెచ్చి కవివర్యులు కొందఱు చెప్పిన పద్యములచే సవ్విషయములన్నియు విశదపడఁగలవు. అట్లు తిరుపతి వేంకటకవు లసాధ్యములని, వదలివేసిన ప్రశ్నములన్నియు నీ సోదర కవి శిఖామణులచే నతిరసాలవాలముగాఁ బూర్తిచేయఁబడెను. అవియన్నియుఁ దూచా తప్పకుండఁగాఁ జదివి వినిపించుటచే మహానందముఁజెందిన సభ్యులందఱు నీ సోదరకవి సింహుల సనేకవిధంబుల స్తుతించి నూటపదాఱులిచ్చి బహూకరించిరి.