పుట:Bhaarata arthashaastramu (1958).pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్పత్తికాండము - ప్రకృతి

పదియవ ప్రకరణము

ఉత్పత్తికి మూలాధారములు

ఉత్పత్తికి మూలాధారములు రెండు. ప్రకృతియు పౌరుషమును. నిసర్గజ వస్తుసముదాయంబు ప్రకృతి. పురుషోద్యోగంబు పౌరుషంబు. దీనికే శ్రమయనియుం బేరుకలదు. ఇవిరెండును క్షేత్రబీజములట్లు అన్యోన్యసహకారులైనంగాని ఫలంబు సమకూరదు. స్వచ్ఛందముగ నింటిముంగిట మొలచిన కూరలు సైతము మనము సంగ్రహించి కొనినంగాని భోగ్యములుకావు. ఎంతలేదన్నను సంగ్రహవినియోగములైన నుండితీరవలయును. సంగ్రహములేకున్న నర్థములు ప్రాప్తింపవు. వినియోగములేకున్న నర్థములు లభించియు ఫలము లేదు.

శ్రమ ద్వివిధంబు. దేహశ్రమ. మనశ్శ్రమ. శ్రమవంతులుగాని పురుషుల కేపురుషార్థములును లభింపవు.

కొందఱు సర్వము దైవికంబందురు. ఇందు నిజంబు గానము. సర్వమును దైవికంబేయయిన మనుష్యప్రయత్నమును దైవికమె యగుగాన నది కూడదనుట విరుద్ధవాదము. దైవికంబని యాహార నిద్రల మానియున్నవాని నెవరు నెఱుగరు. సోమరిపోతులు తమ పరముగా జేసికొన్న రాద్ధాంతములలో నిదియొకటి . ఇది నిజమేయైన పక్షమున ధర్మాధర్మముకు భేదము లవమాత్రము నుండదు. కామక్రోధాదులును దైవికములే యగునుగాన వాని నరిషడ్వర్గములని యంటిమేని దేవుడు తనకుదానే శత్రువనియు, ఆత్మహత్య జేసికొనుటలో జాల సమర్థుడనియు జెప్పవలసి వచ్చును. ఇది యటుండనిండు.