పుట:Bhaarata arthashaastramu (1958).pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దీనికి సమాధాన మేమనగా నాణెములయొక్క విలువ చలించునదియైనను, ఈ చలనముయొక్క పరిమాణమును నిర్ణయించి, యీ చలనమువలన గలిగిన మార్పుల లెక్కకుదెచ్చి తీసివేయ వచ్చును. ఈ విషయము వినిమయకాండమున జర్చించబడును.

ఈ యాక్షేపణలు అసమంజసములుగావు అయిన నొక్క విన్నపము. ఉపయుక్తతయు క్రయమును ఒండొంటి నానియుండుటచేతనే క్రయమును ఉపయుక్తతా సూచకమని యెన్నదగును. రెండవది ప్రతివానియొక్కయు వస్త్వాదరమున భేదములు పెక్కుపోకల బోయినను మొత్తముమీద పణ్యచక్రంబున నట్టివిఱుపులు పరస్పర హతములౌట సాధారణముగాన, గిరాకియొక్క యుత్కర్షమును ధరలు నిష్కపటముగ సూచించుననుట యొప్పుకోవలసిన న్యాయము. ఈ విషయ మటుండనిండు.

ఆవరణకృతమైన శేషము గణనీయ మనుటకు నొకహేతువుం జూపి వాంఛావిచారంబు చాలింతము.

ఇంగ్లాండులో ఏటికి 5000 రూపాయల గడనయున్న నింద్రభోగముగా సర్వసుఖంబుల ననుభవించుట నిఖిలజనవేద్యమైన మహాయోగము. 10,000 రూపాయల జీతమునిచ్చి యొకనిని ఒక గహన స్థలంబున కలెక్టరుపనికి నియమించిన వాడారూపాయలతో నేమిచేయనౌను? సరసకవుల గోష్ఠియు, నాటకప్రయోగములు, పాటవేడుకలు, ఇత్యాది హృదయాహ్లాదక విశేషములు ఎంతవ్యయమునకును లభించునా? తుదకు రుచియైన పదార్థములు, విందులు, పండుగలు సయితము గోచరింపవు. అట్టివాని యావరణకృతమైన సుఖశేషము సున్న. కావున నుండియు నెండినవాడగు.

జనులయొక్క ప్రాభవముంగూర్చి చింతించుటలో నావరణమును మఱవగూడదు సుడీ! జీతముబట్టి సుఖమును నిర్ణయించుట మూఢత్వము. మఱియు ఆస్తికన్న నాదాయము ముఖ్యము. నేలలు, పశువులు, ఇండ్లు, చెఱువులు నమేయములుగ నుండినంజాలదు. వచ్చుబడి పెచ్చుపెఱిగినగాని ప్రయోజనములందుట దుర్ఘటము.