పుట:Andhraveerulupar025903mbp.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జ్యమున కపాయము వాటిల్లునని రాయ లూహించి తొలుత కొండవీటిని ముట్టడింప సంకల్పించెను. తిమ్మరుసుమంత్రి దూరము యోజించి గజపతులబలమంతయు ఉదయగిరియందున్నదిగాన నాదుర్గమునె తొలుత లోగొనవలయునని చెప్పెను. కృష్ణరాయ లియ్యకొని సంగర సన్నధము చేయ నజ్ఞాపించెను. గోవిందామాత్యునికి లక్షసైన్యమును స్వాధీనముచేసి విద్యానగరమును జాకరూకతో గాచియుండ గట్టడి జేసి, యొక శుభముహూర్తమున నాస్థానవిద్వాంసులతో నంత:పురజనముతో ససంఖ్యాకసైనిక సమూహముతో పూర్వదిగ్జైత యాత్రకు కృష్ణదేవరాయలు బయలుదేరెను.

క్షత్రియవంశభూషణులగు శ్రీరంగరాజు, నారపరాజ ఇమ్మరాజును, బ్రాహ్మణవీరుడగు రాయసము కొండమరుసున, కమ్మనాయకుడగు పెమ్మసాని లింగన్నను, వెలమవీరుడగు వెలుగోటి కుమారతిమ్మనాయకుని, పంట రెడ్డియగు గంగాధర రెడ్డిని సేనానాయకుల గావించి ఒక్కొక్కరి యధీనమున ముప్పదివేల కాల్బలము, నాలుగు గుఱ్ఱపుదళములు, ఇన్నూరు మదపుటేనుగులు నుంచి, తిమ్మరుసుమంత్రి యుచితవిధు లందఱకు నివేదించెను. సైనికబలము నలుగెలంకుల నడచుచుండ రాయలు మహోన్నత గజరాజమునెక్కి బ్రాహ్మణులస్వస్తి వాచకముల, కవుల రణగీతముల నాలించుచు బ్రాగ్దిశాభిముఖుడై బయలుదేరి యచిరకాలమున కుదయగిరి జేరెను.