పుట:Andhraveerulupar025903mbp.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తుగ్లక్ తన కుమారుడగు అలూపుఖానునకు అపరిమితమగు సైన్యమును సహాయముగ నొసంగి యాంధ్రసామ్రాజ్యమును ముట్టడింపబంపెను. ఇది నాలుగవ ముట్టడి. ప్రతాపరుద్రుడీ వార్త విన్నంతనె సమీపదుర్గములందున్న సైన్యమును సేనాధిపతులను రప్పించి రాతికోటలోని ప్రతిదుర్గమునకు ఒక్క వెలమవీరుని గొంతసైన్యమును గాపుంచి ద్వారములన్నింటినిండ వీరాధివీరులగు సైనికులనుంచి తేరాల బచ్చిరెడ్డి, కొలిపాక సిద్దయ్య, శ్రీరంగమదేవుడు, మహాదేవనాయకుడు, గన్నయ్య సేనాని, కుమారరుద్రదేవుడు లోనగుమహావీరులు సవలక్ష సైనికులతో నాంధ్రసామ్రాజ్యము సంరక్షించుటయో సంఘమరణ మొందుటయో కర్తవ్యమని రణమునకు దలపడిరి. రాచర్లవద్ద విడిసిన యవనసైన్యము ముందునకు వచ్చెను. మహాత్ముడగు శివదేవయ్య వీర చందనము విభూతిగైకొని వీరులందఱును నాశీర్వదించి తిలకము మొగమునిండ, గందము మేన బూసి రణమున కంపెను. అద్వితీయపరాక్రమముతో నాంధ్రులుపోరాడిరి. రాజ్యమునందున్న ప్రతిపౌరుడు రణమున బాల్గొనెను. చుట్టుపట్టునగరముల వారందఱు పగతుర సైన్యము ననేకవిధముల జెండాడిరి. కడకు మహమ్మదీయసైన్యము సంపూర్ణముగ నాశనమయ్యెను. సరదారులు పలువురు మరణించిరి. యుద్ధోపకరణములన్నియు నూడలాగికొని ఆంధ్రవీరులు మహమ్మదీయుల గోదావరితీరము దనుక బాఱదోలిరి. అలూపుఖాను మూడువేల గుఱ్ఱపుదళముతో డిల్లీచేరి తన పరాజయ కథయంతయు దండ్రికి నివేదించెను.