పుట:Andhraveerulupar025903mbp.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సర్వవైభవ సంపన్నమగు దుర్గము మహమ్మదీయులకు స్వాధీనమయ్యెను. అనంతరము సముద్రమువలె బొంగి పొరలివచ్చు యవనసైన్యమును సూనార్పారు దుర్గమువద్ద నాంధ్రు లెదిరించిరి. ఉభయపక్షములవారికి భయంకరసంగరము జరిగెను. దురదృష్టవశమున నాంధ్రు లోడిరి. మహమ్మదీయ సైన్యము ఆంధ్రనగరము ముట్టడింపవఛ్ఛు వార్తవిని ప్రతాపరుద్రదేవుడు శూరులనందఱ బిలువనంపి చాపకూడుగుడిచి, యుచిత రీతి సత్కరించి ప్రతిపక్షుల నెదిరింప బంపెను.

ఆంధ్రసైనికు లప్రతిమాన పరాక్రమముతో యవన సైన్యము నెదిరించిరి. మహమ్మదీయులు పట్టుదలతో నిలిచి యాంధ్రనగర దుర్గముల కన్నింటికి శతఘ్నులు బారుచేసి కాల్పసాగిరి. ఓరుగల్లుకోట కన్నివైపుల యవన సైనికులు మూగిలోనికెటుల బ్రవేశింపవలయునో తోచక కలవరపడు చుండిరి. చుట్టును పుట్టకోటయు దానిచుట్టు మిగుల విశాలమగు అగాధజల పూరిత పరిఘయు నుంటచే మహమ్మదీయులు ముందులకుబోవ జంకిరి. కోటగోడపై నున్న వీరులు పరిఘలో గాలుంచిన వీరుని నుంచినటుల ఖండింప దొడంగిరి. ఇట్లు నెలల కొలది గడచెను. ఆంధ్రనగరము యవనులకు సాధ్యము కాదయ్యెను. ప్రతాపరుద్రదేవుడు శైవమత పక్షపాతియని భావించి యానృపాలుని ద్వేషించు జైనాచార్యులు కొందఱు రహస్యముగ మహమ్మదీయుల గలసికొని కోటయాకృతి యంతయు దెలిపిరి.