పుట:Andhraveerulupar025903mbp.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చలించెను. కడకు గర్తవ్యము దోచక కాటమరాజు రణరంగమున బ్రవేశించి తనకడ్డముగానున్న ప్రతిపక్ష సైన్యమును దెగటార్చుచు ఖడ్గతిక్కనను సమీపించి నమస్కరించి "బ్రాహ్మణోత్తమా! పోరుడుగుము, పోరుడుగుము. బ్రహ్మహత్యా పాపము మాకంఠముల జుట్టకుము. చేతులార నిన్ను వధింపజాలము. వెనుకకు మరలిపొ"మ్మని దోసిలియొగ్గి సవినయముగా బ్రార్థించెను. ఖడ్గతిక్కన యాతని నగౌరవించి "చేతగాకున్న పుల్లరినొసంగి శరణు గోరుము. శక్తియున్న నెదిరింపుము. పెక్కుమాటలేల? బ్రాహ్మణుని జంపదగదని ధర్మశాస్త్రములు వల్లింప దలంచితిరేని మీకు సంఘవిలయము తప్పదు పొమ్మ"ని తిరస్కరించెను. కాటమరాజు చేయునదిలేక తన సైన్యమును ఖడ్గతిక్కనమీదికి బఱపి కాటమరాజు స్వయముగా సంగ్రామభారము వహించెను. రెండు మూడు మాఱులు మంచి యవకాశము లభించినను భ్రాహ్మణ భక్తుడగు కాటమరాజు ఖడ్గతిక్కనను విడిచిపెట్టెను. ఖడ్గతిక్కన యట్టి యవకాశము తనకు జిక్కినపుడు చేతనైనంతవఱకు బ్రతిపక్షసైన్యమును మారణము చేయుచుండెను. ఈ పరిస్థితులను గమనించి సేనానాయకుడగు బ్రహ్మరుద్రయ్య కాటమరాజువద్దకేగి, "నృపాలకా! నీవాగుము. బ్రాహ్మణుడని ఖడ్గతిక్కనను నీవు వదలుటచే నాతడు మనసైన్యమును రూపుమాపుచున్నాడు. వర్ణాశ్రమ ధర్మములు విచారింపవలసినది సంగ్రామరంగమందా? పేరునకు నీవు సేనాధీశ్వరుడుగ