పుట:Andhraveerulupar025903mbp.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సైన్యము నెదిరించి పట్టుదలతో బోరాడుచుండెను. యాదవ సైన్యము ఖడ్గతిక్కన సైన్యమును జాలవఱకు నాశనముగావించి ముందునకు వచ్చుచుండెను. ఈపరాజయ పరిస్థితులగాంచి యేని జంకక ఖడ్గతిక్కన హతశేషమగు సైన్యముతో జిరకాలము పోరాడెను. యాదవసైన్యము చుట్టుముట్టి ఖడ్గతిక్కనను నాతని స్వల్పసైన్యమును బట్టుకొనిరి. ఖడ్గతిక్కనను కాటమరాజు సమీపించి "బ్రాహ్మణోత్తమా! సంగరము మానుకొనుము. బ్రాహ్మణుల జంపిన మాకు బ్రహ్మహత్య వచ్చును. అగ్రవర్ణులగు మీరు మాతోబోరుట న్యాయముగాదు. మమ్ము గోపింపక సంగరయత్నము మానుకొను" మని ప్రార్థించి విడిచిపెట్టెను. ఖడ్గతిక్కన చేయునదిలేక గుఱ్ఱమునెక్కి నెల్లూరి కేగి సైన్యముతో రాదలంచి గృహాభిముఖు డయ్యెను.

పరాభవదు:ఖముతో ఖడ్గతిక్కన గృహము చేరెను. మంచములోనున్న సిద్ధానామాత్యుడు తన కుమారుడు పారి వచ్చినాడని తలంచి "ఛీ పాఱుబోతా! తుచ్ఛమగు ప్రాణము కాశపడి యిల్లు చేరిన నిన్ను జూచిన పాపమువచ్చు"నని ఖడ్గతిక్కనను నొవ్వనాడెను. తండ్రియొనరించిన తిరస్కారముచే ఖడ్గతిక్కనహృదయము కలగిపోయెను. ఇంటిలోనికిబోవ నతని భార్య చావమ్మ భర్తను సాదరంబున జూచి 'వంటయైనది, స్నానముచేయు' డని చెప్పి స్త్రీలు స్నానముచేయుతావున నొక మంచము చాటుజేసి పసుపుకుంకుమ యట పదిలపఱచెను. ఖడ్గ