పుట:Andhraveerulupar025903mbp.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తించి చేతులు కట్టుకొని యాకాంతకు జెంత నిలిచి విచారపడుచు అన్యాయముగ బరకాంతకు శ్రమగూర్చితినే యని లోలోన గృశించుచుండెను. కొంతసేపటికి అన్నమ్మకు దెలివి వచ్చెను. బాలచంద్రునకు బ్రాణములు లేచివచ్చెను.

అన్నమ్మ కనులు తెఱచువరకు బాలచంద్రు డెదుట గానవచ్చెను. బాధచే మైమఱచి అన్నమ్మ నీకండకావరము కాలిపోను, బొంగరముతో గొట్టుదువా? రాజుసొమ్ము తేరగా దిని యొడలు బలిసియున్నావు. నీచూచుకన్నులలో సూదులుగ్రుచ్చ, నీకాలిలో గత్తులుదిగ, నీతండ్రి, రాజు యుద్ధములో నుండ బోతుసింగమువలె బోతరించి యింట నుండునది ఆడువారిమీద నాగడము చేయుటకా, యని పెళపెళ దిట్టిపోసెను. బాలచంద్రుడు తిట్లన్నిటికి సహించి దోసలిమోడ్చి, తల్లీ! క్షమింపుము. ప్రమాదమునకు మన్నించుట విధి యని బ్రతిమాలి ఐదువందల మాడల నామెకిచ్చి తప్పు క్షమింప బ్రార్థించి తన తలపాగ చించి, యామె కాలికిం గట్టుకట్టించి మాతండ్రు లెచటనున్నారో చెప్పుమనెను. అన్నమ్మ బాలునిపై కోపమునాపుకొని "కోపముచే నేమంటినో నేనెఱుగను. మీతండ్రిగారి సంగతి నేనెఱుగననెను." బాలచంద్రుడు వెంటనే యింటికిబోయి తల్లియగు నైతమ్మను సమీపించి నాతండ్రి యెచట కేగెనో తెలుపుమనెను. ఏదో ప్రమాదముజరిగినది. బాలుడు సంగరమునకురుకు నటులున్నాడు. ఇంకనేమి చేయవలయునోయని యైతమ్మవిచారపడి, బాలుడా!