పుట:Andhraveerulupar025903mbp.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొంతకాలము, కాంచికానగరము మిగిలిన కాలమంతయు రాజధానిగా నుండెను.

కులోత్తుంగచోడుడు ఉత్తరదిక్కున కళింగము, దక్షిణము కన్యాకుమారి, తూర్పుదిక్కున సముద్రము, పడమటి దిక్కున కుంతలదేశము, సరిహద్దుగాగల విశాలమగు దేశమును ఏకచ్ఛత్రాధిపత్యముగా నించుమించుగ నేబది సంవత్సరములు పరిపాలించెను. ఇతనిరాజ్యకాలము క్రీ.శ. 1070-1120 వరకని చరిత్రకారులు నిశ్చయించినారు. కులోత్తుంగచోళుని పరాక్రమజీవితము సంస్కృత ద్రవిడగ్రంథములలో విశేషించి కీర్తింపబడెను. ఆంధ్రభాష కీనృపాలు డెంత సహాయము గావించినో ఆకాలమున బయలువెడలి యాంధ్రకావ్యము లెవ్వియో యెఱుగ నవకాశము చిక్కలేదు. కులోత్తుంగచోడ మహారాజు శైవమతాభిమాని. విష్ణ్వాలయముల ననేకముల గూలద్రోయించెననియు విశిష్టాద్వైతమత ప్రవర్తకుడగు రామానుజాచార్యుని మతప్రచారమును సాగకుండ జేసెననియు ఆపాపముచే నీతడు గతించెననియు వైష్ణవమత గ్రంథములందును రామానుజ చరిత్రమునందును గలదు. ఈరాజు మరణమునుగూర్చి కొన్నికథ లాగ్రంథమున గలవుగాని వాని సత్యాసత్యచర్చతో మనకు బనిలేదు. కులోత్తుంగుడు మరణించువరకు రామానుజు డతని రాజ్యమున నెట్టి ప్రచారము చేయక మైసూరురాజ్యమున నున్నమాట వాస్తవము.