పుట:Andhraveerulupar025903mbp.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కులోత్తుంగుడు తన రాజ్యము సుభిక్షముగా నుంటకై యనేక తటాకముల నిర్మించి రైతులకు బెక్కు సౌకర్యములు కలుగజేసెను. ప్రజలు ధాన్యరూపముగ బన్నులు చెల్లించు నట్లును గ్రామమునుండి వసూలుగావలసిన సిస్తులపై యధికారము గ్రామాధికారిపైననె యుండునట్లును కట్టుదిట్టములుచేసి వ్యాపారము నభివృద్ధిలోనికి దెచ్చెను. కులోత్తుంగచోడుని కాలమున మిగులనభివృద్ధిలోనికివచ్చిన యీయాంధ్రరాజ్యము రానురాను అతని యనంతరము క్షీణించి కడకు కాకతీయ సామ్రాజ్యములో మఱికొంతకాలమునకు లీనమైపోయెను.

చేర, చోళ, పాండ్య కళింగాంధ్రాదిదేశముల నేకధాటిగా బరిపాలించిన యీయాంధ్రచక్రవర్తి జీవిత చరిత్రము మనము పూర్తిగా మఱచినారము. పూర్వరాజుల ప్రతిష్ఠాలేశముల నాలపించు శిలాశాసనాదులకడ కేగితిమేని ప్రశాంతసమయమున గులోత్తుంగచోడుని యశోగీతికల నాలింపవచ్చును. స్వామిభక్తి పరాయణులగు నాంధ్రశూరుల రక్తముచే దడిసిన పుణ్యభూములు త్యాగజీవితమును దెలుపు శాసనరాజములు మాసిపోయిన చాళుక్యనృపుల ప్రతిష్ఠను జరిత్రవిదులకు జ్ఞాపకము చేయుచున్నవి. మహత్తరమగు నా రాజ్యముతో బాటు నాంధ్రసోదరుల విక్రాంతియు మఱపునకు వచ్చుట దురదృష్టము.