పుట:Andhraveerulupar025903mbp.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భావము ప్రజలయొద్ద భక్తి విశ్వాసములు గల యీమంత్రివర్యుల నేవిధముగనేని వంచింపనెంచి తరుణముకొఱకు వేచియుండెను. అక్కనమాదన లాతని లక్ష్యపెట్టరైరి.

మొగలురాజు లెటులైన గోలకొండరాజ్యము హరింప దీప్రయత్నములు కావింపసాగిరి. ఔరంగజేబు మిగులనాసక్తితో గోలకొండ రాజ్యముకొఱకు గుటుకలు మ్రింగుచుండెను. అక్కన్న మాదన్నగార లీయంశము గ్రహించి రాజ్యములోని హిందూమహమ్మదీయుల కైకమత్య మభివృద్ధిగావించి యాకాలమున బలవంతుడైయున్న శివాజీచక్రవర్తితో దానీషాకు స్నేహము కుదిర్చిరి. శివాజి గోలకొండ కొకమారువచ్చి తానీషా యొసంగిన యాతిధ్యము స్వీకరించి గోలకొండ రాజ్యము సురక్షితముగ జేయుదునని వాగ్దానము గావించెను. శివాజీ కాలధర్మము నొందిన పిమ్మట శంభాజి రాజ్యమునకు వచ్చెను. అక్కన్నమాదన్నగారలు పూర్వము వలెనే శంభాజికి దానీషాకు నైకమత్యము గుదిర్చిరి.

రాజ్యతృష్ణగల డిల్లీశ్వరుడగు నౌరంగజేబు గోలకొండ రాజ్యము హరింపవలయునని పలుమాఱు సైన్యమును బంపెను. అక్కన్న మాదన్న గారలు యవనాంధ్ర సైన్యముల నెదురు నడిపి యౌరంగజేబు సైన్యముల వినాశము గావించిరి. అవమాన పీడితుడగు నౌరంగజీ బంతతో నాయత్నము మానుకొనక గోలకొండ రాజ్యముకొఱకు దురాలోచనములు పెక్కు చేయుచుండెను.