పుట:Andhraveerulupar025903mbp.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

త్నములన్నియు విఫలమైనందులకు మిగులవగచి సైన్యసహితముగ బోరాడి చంద్రగిరి దుర్గమును సాధించినగాని రంగరాజును విడిచిపెట్ట వీలుకాదని సైనికబలము నభివృద్ధిచేయు చుండెను. ఇంక నుపేక్షించినయెడల బ్రతిపక్షులు బలవంతులై రంగరాజును బంధోన్ముక్తినిగావించి తిరుగబడక మానరని దయావిహీనుడగు జగ్గరాజు రంగరాజు కుటుంబమును నాశనముజేయ సిద్ధపడెను. జగ్గరా జొకదినమున తనసోదరుడగు ఓబలరాజును బిలిపించి యాతనికి ఖడ్గము నొసంగి కారాగృహమునకేగి లోనున్న రంగరాజును గుటుంబసహితముగా దెగటార్చిరమ్మని పంపెను. క్రూరుడగు ఓబలరాజు దయారహితుడై కారాగృహమున బ్రవేశించి తన యన్నయాజ్ఞ వారికి వినిపించి వారి జెండబోయెను. రంగరాజు తిరుగబడి యోబలరాజును నాతనికి సహాయముగావచ్చిన సైన్యమును బొరొగొనవలయునని యత్నించెను. గాని దానివలన నిరపరాధులగు సైనికులు మరణించుటయెగాని తన కపాయము తొలంగజాలదని తలంచి రంగరాజు కుటుంబమరణమునకె యనుమతించెను. "ఓబలనాయకునిచేత జావనేల? నాచేతిమీదుగ దొలుత గుటుంబమును దెగటార్చి యాత్మహత్మ గావించు కొందుగాక" యని శూరశిరోమణియగు రంగరాజు కత్తిగైకొని యేపాపము నెఱుంగని తనపసిబిడ్డల నిరువురను ధర్మపత్నిని ఖండించి తనతల దాను నఱకికొని పడిపోయెను.