పుట:Andhraveerulupar025903mbp.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వానికి గలుబరగ రాజ్యమునొసంగి కడమ యిరువురను దనరాజధానికి గొనిపోయి వారికున్నతోద్యోగము లొసంగెను. అంతరించిన కలుబరిగిలోని బహమనిరాజ్యమును బునరుద్ధరించుటచే శ్రీకృష్ణరాయలకు "యవన రాజ్యస్థాపనాచార్య" బిరుదమును బ్రజలొసంగిరి. ఈబిరుదము కృష్ణరాయల శాసనములలో బెక్కింటియందుగలదు. సర్వమత సమదర్శియగు శ్రీకృష్ణదేవరాయలను మత ద్వేషముగలవాడనుట సత్యమునకు జరిత్రమునకు ద్రోహముచేయుటె.

కృష్ణదేవరాయలు తన జీతమునం దెన్నడును పరాజయము నెఱుంగడు. గౌతమిపుత్రశాతకర్ణి, కులోత్తుంగచోడుడు, ప్రతాపరుద్ర చక్రవర్తివలె నీతడును ఆంధ్రవీరులలో సుప్రసిద్ధుడు. ఈరాజచంద్రుడు స్వయముగా నాముక్తమాల్యదయను గ్రంథరాజమును రచించెను. మఱికొన్ని గ్రంథరాజములు రచించెగాని యవి యలభ్యములై యున్నవి. ఇతడంకితమొందిన గ్రంథములలో మనుచరిత్రము, పారిజాతాపహరణము సుప్రసిద్ధములు. ఈకాలమున నాంధ్ర వాజ్మయమునకు సర్వతోముఖమగు సేవ లభించెను. రాయల యవలంబనమున ఆంధ్రభాషలో సర్వాంగసుందరములగు కావ్యరత్నములు పెక్కులు రచింపబడెను. రాజకీయ రంగమునందెగాక వాజ్మయమునందుగూడ గృష్ణదేవరాయల దివ్యనామము చిరస్మరణేయముగ నున్నది.