పుట:Aananda-Mathamu.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

52

ఆనందమఠము


యుండెనో యది మహేంద్రునకు మొదట తెలియలేదు. అట్లే చూచుచుండఁగా నొక చతుర్భుజమూర్తి గోచర మయ్యెను. ఆమూర్తి శంఖచక్ర గదాపద్మ హస్తయును, కౌస్తుభశోభిత హృదయయునునై యుండెను. ఆమూర్తి కెదుట సుదర్శనము ఘూర్ణ్యమానప్రాయముగ స్థాపితమై యుండెను. మధు కైటభ దైత్యస్వరూపములు బృహదాకారఛిన్న మస్తకములుగను రక్త ప్లావితమైనవిగను చిత్రింపఁబడి యుండెను. వామభాగంబున శ్రీలక్ష్మీదేవి విగ్రహము విశీర్ణ కుంతలముతోడను, శతదళమాలాధారిణిగను, భయకంపిత శరీరిగను నిలుచునట్లు నిర్మింపఁబడి యుండెను. దక్షిణ భాగమునందు సరస్వతీ దేవి వీణాపుస్తకపాణీయు మూర్తిమంతము లైన రాగరాగిణి పరివృతయు నై నిలిచి యుండెను. వీనికంటె, మహోన్నత స్థానంబునందు మంచము మీఁద నవరత్న ఖచితాసనమునందొక యైశ్వర్యాన్విత మోహినీ మూర్తి యుండెను. ఆమూర్తికి, దేవ గంధర్వ కిన్నర యక్ష రక్షస్సు లెల్లరు వివిధోపచారములు చేయుచున్నట్లు కన్పట్టెను. బ్రహచారి గద్దద స్వరముతో మహేంద్రునిం జూచి, "అన్నియుఁ జూచినావా!” యనెను.

మహేంద్ర——అన్ని టిని జూచితి.

బ్రహచారి——మీఁద నున్నదేమి, చూచితివా?

మహేంద్ర——చూచితిని, అది యెవరు?

బ్రహ్మచారి ——మహామాత.

మహేంద్ర——మహామాత యెవరు?

బ్రహ్మచారి—— సంతానులకుమాత, మాకు ఆమెయేతల్లి,