పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

84

శ్రీ దేవీ భాగవతము


తే.గీ. అయ్యయో యేమి సేయుదు నాత్మపొగులు | నయ్యవారినిఁజేయబో నాయెఁ గోరి
    కర్మధర్మంబులను గోరి కన్న కొడుకు | కర్మవశమున బైరాగి కాఁదలంచె.545

వ. అప్పుడు వ్యాసుండు 546

తే.గీ. గడగడవడంకెఁ గడు తనుగ్లాని వొడమె | చూపుమ్రాన్పడె గొంతెండె స్రుక్కెమోము
   మాట బొంగురువోయె నమ్మౌనివర్యుఁ | డావురనియేడ్చె గన్నీళ్లు బావినిండె.547

తే.గీ. దాని కచ్చెరుపడి మునికూన యాత్మ | లోనఁ దలపోసె నౌర యీ మౌని కింక
   మోహపాశంబు విడదాయె మూర్ఖునట్లు | చింతనొందెడి నేమందు వింతయనుచు.548

వ. ఒక్కింత దడవు విచారించి సకరుణంబులగు వచనంబుల శుకుండు దండ్రిం జూచి.549

క. వేదాంతకర్తయు నిఖిల | వేదియు వేదసము డితఁడు వెంగలియై సా
   రోదారజ్ఞానము చెడి | ఖేదించెడి నహహ మాయ గెంటవశంబే.550

ఉ. ఎంతటి మాయయో యెరుగ నెంతటి దుఃఖము దీనిగెల్వ ధీ
    మంతులు పండితోత్తములు మాన్యులు నేరరు వ్యాసుఁ డీతఁ డా
    వంతయు ధైర్యమూనకయ వంతలపాలయి యున్నవాఁడు వి
    శ్రాంతిఁ గనండు భారతము సర్వపురాణములున్ రచించియున్. 551
 
ఆ. బ్రహ్మ విష్ణు హరుల బహుభంగులను మోహ | పాశములను గట్టెఁ బరమశక్తి
    యితరులైనవారి నేటికి స్మరియింప | నట్టి దేవిఁ ద్రిజగదంబఁ గొలుతు.552

తే.గీ. మాయలోఁ జిక్కి సొక్కని మనుజుఁ డెవఁడు | విష్ణు నంశంబున జనించి విశ్వవిదితు
   డైన వ్యాసుండె మునిఁగె మోహార్ణవమున | పుట్టిమునిగిన బిట్టేడ్చు సెట్టిఁబోలె.553

క. ఇతడెవ్వఁడు నేనెవ్వఁడ | మతిభ్రాంతియెకాక నిత్యమా యీ దేహం
   బతుకఁబడెఁ బంచభూత | ప్రతతిం గణియింప దుఃఖభాజన మిదియే.554

ఉ. దేవికి మ్రొక్కి యో జననీ దివ్యమహేశ్వరి నన్ను సత్కృపన్
    బ్రోవుమటంచుఁ బల్కి తనముందట నేడ్చుచుఁ గూరుచున్న చిం
    తావశు వ్యాసమౌనిఁ గని తాత సమస్తము నీ వెఱుంగవే
    యీవిధిఁ గుంద నేమిటికి నెక్కడి మోహము నీకుఁ బాల్పడెన్.555

ఆ.వె. పూర్వజన్మమందుఁ బుత్రుండనా నీకు | భావిజన్మ మెట్ లుపోవునొక్కొ
    నేఁడు నన్నుఁ బుత్త్రునింగా దలంచుట | యెంతవింత దీని కేమి సెప్ప.556

ఆ.వె. దుఃఖ మేల తండ్రి తుడిచెదఁ గన్నీళ్లు | మాను మాను మింత మమత తగదు
    జగము మాయగాని సత్యంబుకాదుసూ | మాయ నమ్మగాదు మానవులకు.557