పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్ర థ మ స్కం ధ ము.

85


ఆ.వె. తిండి యబ్బెనేనిఁ దీఱు నాఁకలి యెందు | నీరుగల్గఁ దీఱు నీరుపట్టు
    కొడుకుఁ బిల్చి ముద్దుఁగొని చెక్కిలిని దువ్వి | చేరియున్నమాత్రఁ దీరునొక్కొ.559

ఉ. వాసనచేత ముక్కు సుఖవాసనఁ గైకొను మంచి గీతిచే
    భాసిలు వీను చల్లనగు వాయువుచేఁ దనియున్ శరీర ము
    ల్లాసము నొందుఁ దియ్యని ఫలంబుల నాలుక కన్ను లొందు ని
    చ్ఛాసమవాప్తి రూపమున సౌఖ్యము పుత్రునివల్లఁ గల్గెనే.560

క. విలువఁగొని యజీగర్తుం | డెలమి హరిశ్చంద్రమానవేశున కీఁడే
    తలఁపునఁ గరుణ యొకింతయుఁ | గలుగక దా యజ్ఞపశువుగాఁ దనకొమరున్.561

క. మనమున నిహపరసుఖతన్ | దనరితి వేనియును నీవు ధన మార్జింపన్
    బనిబూనుము వెతమానుము | తనయుఁడ నావలన నేమి ధన్యత గలుగున్.562

ఆ.వె. జన్మరహితమైన సాధనంబును జెప్పి | గర్పనరకభయముఁ గడపఁజేసి
    జ్ఞానమిచ్చి మాయ కట్టిన ముడి విప్పి ! తండ్రి నన్నుఁ బ్రోవఁదలఁపుమయ్య.563

మానిని. జానుగ మానవజన్మ మసాధ్యము సంయమినాయక యెందుఁ గనన్
    భూనుతమై తగు భూసురజన్మముఁ బొందుట దుర్లభ మందును న
    న్మానితవంశ సమంచితవృత్తిని మర్త్యభవంబ దశక్యమగున్
    గాన మహోత్తమ కార్యము జ్ఞానము గట్టిగఁ జెప్పుము జ్ఞాననిధీ.564

వ. బహువిధంబులం బరమహంసాశ్రమంబుం గొనియాడు తనయుని శాంతరస సమావేశ కలిత
    సుఖంబైన ముఖంబు జూచి తలయూచి వ్యాసుం డిట్లనియె.565

క. ఓ ముద్దుల తనయుండా | నీ మాటలు బ్రహ్మమార్గనిష్ఠల కోటల్
    కామమును జెరుగు చేటలు | మోము నెదుటి ముక్తిధనము మూటలుగావే.566

వ. అయినను.567

సీ. వినుము బాలక నేను విస్తరించి రచించి ప్రకటించయున్నట్టి భాగవతము
     అది నాతివిస్తీర్ణ మది బ్రహ్మసమ్మతంబును సమస్త పురాణ భూషణంబు
     అది జ్ఞానదము శ్రావ్య మత్యంత శుభదంబు పఠింయింపు మద్దానిఁ పరమనిష్ఠ
     పాలపాపనిరూపుఁ చాటింప వటపత్రశయునుఁడైన సరోజనయనుఁడాత్మ

తే.గీ. నెట్టు లే బాలభావంబు నెనసి యిచట | నేవిధంబునఁ బుట్టితి నేది ద్రవ్య
     మెఱుఁగనని చింతిలం జూచి పరమశక్తి | సర్వ మే నితరములేదు సత్యమిద్ది.568

వ. అనిన 569

క. పలుకు విని విష్ణుదేవుఁడు | పలికినవా రెవ్వరంచు బహుభంగులఁ దాఁ
    దలఁచి తలఁచి వలపోయఁగ | నెలఁతవలెన్ దేవి యెదుట నిలిచెన్ గరుణన్.570