పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


వ.

అని యంతంతం జేరవచ్చి యయ్యంత్యజాతిసీమంతిని యశేషజనపూజనీయులు బ్రాహ్మణులని తమ కులంబు [1]పెద్దలవలన వినుటం జేసియుఁ దా[2]నెందే నొక్కపూర్వజన్మకృతపుణ్యసంస్కారవిశేషంబుననో బాల్యంబు [3]నాఁటనుండియు రూపంబు వినయంబు దాక్షిణ్యంబు మధురాలాపకౌశలంబు నిస్సంగతప్రశాంతమహానుభావంబు శుచిత్వంబు గౌరవంబు సద్భావంబు గుణంబులు నైసర్గకంబులయి యుండుటనో భర్గఫాలనయనకృశానుజ్వాలాజాలహేలాచుళుకితావయవుండు గాని కుసుమకోదండుండునుం బోలెఁ గన్నులపండువై తప్తకాంచనవర్ణంబును గోరాచనాగౌరంబును జాంపేయకుసుమకేసరరేణుత్రసరేణువిసర[4]పిశంగంబునునగు దేహ[5]ప్రభాప్రవాహంబున గహనషండం బశేషంబును వెలిగించువాని నుద్భిన్ననవశ్మశ్రు [6]నభినవయౌవనోద్భాసితు షోడశవర్షదేశీయు నాదిగర్భేశ్వరు నమాత్యనందను సుకుమారుం గుమారసన్నిభుఁ దప్పక చూచి భయసంభ్రమడోలాయమాన దంతతాటంకవలయం బగునట్లుగా నిబ్బరంపు గుబ్బచన్నుల బిబ్బోకంబు బాహుమూలకూలంకషంబై యీషద్విలోకనీయం[7]బుగఁ గేలుదోయి సేవాంజలిపుటంబు లలాటంబునఁ గీలించి యయ్యగారికి నమస్కారంబని యధరకిసలయంబునకు దశనరత్నాంకురజ్యోత్స్న కుసుమస్తబకంబుగా సహకారపల్లవాస్వాదకషాయకంఠకలకంఠకామినీ కోమలకుహూకారకోలాహలకరంబిత పంచమరాగ ప్రపంచంబునకు మించుఁజూపు కంఠస్వరంబునం బలికిన.

39


గీ.

వెలఁది మాలెత గాన దీవింపకయును
నొప్పెడిది గాన నూరకయుండకయును
ధరణి దేవుండు గైకొనె దాని మ్రొక్కు
గేలుఁదామర తిర్యగాందోళనమున.

40


ఉ.

శంబరవైరిసన్నిభునిఁ జారుతరోజ్జ్వలమూర్తి విప్రర-
త్నంబు మహాప్రధాను ప్రియనందనునిన్ సుకుమారుఁ జూచి ప్రే-
మంబు వహించియుం గొమరుమాలెత గన్నుల నవ్వు దేరఁగా
[8]సంబళిసంబళీ యళుకు సందడికిం దలమంచుఁ బల్కుచున్.

41


గీ.

బ్రాహ్మణుఁడు గాన లజ్జింపఁ బ్రాప్తి లేక
బాల ప్రౌఢయవోలెఁ దప్పకయ చూచి
చాటువడి యుండుమయ్య యీ సరసిలోన
నుదకమాడెదఁ[9]గాక పిన్నదియు నేను.

42


క.
  • అని పలుకుచుఁ గొలనికి డిగఁ

జని మాలప్రమద దాను సఖియు నొనర్చెన్
వనకేళితరంగ లురు-
స్తనభారాస్ఫాలనమున జర్జరములుగాన్.

43


చ.

పడఁతి పసిండిడాలు [10]గనుపట్ట [11]హరిద్ర ప్రతిప్రతీకమున్
దొడసి సరోవరాంబువునఁ దోఁగి పయోనిధితీరభూమికిన్
వెడలి ధరాసుపర్వునకు నేత్రమహోత్సవమయ్యె నప్పుడ-
ప్పుడ కలశాబ్ధిమధ్యమునఁ బుట్టిన యాదిమలక్ష్మియో యనన్.

44


గీ.

కొలను వెలువడి తడినూలు వలువ విడిచి
మణుఁగు పుట్టంబుగట్టి యమ్మగువ యొప్పె
[12]జలద మెడవడి వర్షావసానవేళఁ

  1. తా. బ్రాహ్మణులవలన
  2. తా. నెద్ది
  3. తా. నాది
  4. ము. ప్రసంగంబును
  5. తా. ప్రభావంబున
  6. తా. నభినవ
  7. తా. బగు
  8. తా. శంబళిశంబళీ యరకు
  9. తా. గాని
  10. తా. గల పచ్చ
  11. ము. హరిద్రముఁ దీరపంకముం
  12. ము. తా. జలధి వెలువడి