పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/284

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

252

పద్మపురాణము


సీ.

అమరదానవగణం బక్కొండఁ గొనిపోయి
        మొదలింటిచోటను బదిలపఱిచి;
రంత బ్రహ్మాదులు నత్యంతభక్తితో
       శ్రీసూక్తముల నుతిసేయుచుండ
నన్నీరజాక్షి ప్రసన్నాత్మయై వారి
       దయఁ జూచి యిట్లను నయముతోడ
నేమైన వరము మీ కిచ్చెద వేఁడుకొం
       డన విని వార లిట్ల నిరి ప్రీతి


ఆ.

లోకమాత! నీవు లోకముల్ రక్షింప
జననమైన కతన సర్వజగము
లధికమైన సమ్మదాబ్ధిఁ దేలుచునున్న
వింతకంటె వరము లెవ్వి మాకు.

124


వ.

అఖిలలోకాధీశ్వరుండైన నారాయణు వక్షస్స్థలంబున నిత్యాన
పాయినివై యుండు తొల్లింటియట్ల నీకటాక్షంబున సకలస్థావర
జంగమాత్మకం బగు జగంబులెల్ల రక్షింపుము. బ్రహ్మరుద్రాది
[1]దేవపదంబుల కాధారంబవై యని పలికిన నట్ల కాక యను న
ద్దేవికి నారాయణుండు ప్రత్యక్షం బగుటయు.

125


క.

ప్రణమిల్లి వార లందఱుఁ
[2]బ్రణతు లొనర్చిరి నవీనపంకజనేత్రున్
గుణయుక్తు నిత్యు నారా
యణు సర్వశరణ్యు పావనారాధ్యు హరిన్.

126


వ.

ఇట్లు వినుతించి బ్రహ్మాదిదేవత లప్పరమేశ్వరున కిట్లనిరి.

127
  1. దేవగణంబులకెల్ల నాధారంబ వని (హై)
  2. ప్రణతులు గావించి ధవళపంకజనయనా, గుణముక్తనిత్య నారా, యణ సర్వశరణ్య భావనారాధ్య హరీ (ము)