పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/276

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

244

పద్మపురాణము


తే.

వైవ నమ్ముని కోపించి [1]దేవవిభుని
గ్రూరదృష్టిఁ గనుంగొని కోపవహ్ని
మండి[2]తా నింత సేయు నీమహిమ వొలిసి
లచ్చియడఁగెడు మని శాప మిచ్చె నపుడు.

88


వ.

అ ట్లతిభీషణంబగు [3]శాపం బిచ్చిన నింద్రుండును దేజం బెడలి
పురంబునకు నరుగుదెంచె; నంత నమ్మునిశాపంబున రాజ్యలక్ష్మి
తొలంగిన దీనుండై యుండె[4]నద్దేవికటాక్షంబు నాశ్రయించి
సకలస్థావరజంగమంబులుం బ్రవర్తిల్లు; నట్టి యింద్రుని కలిమి
యంతర్ధానంబు నొందుటం జేసి మూఁడులోకంబులు సంపత్తి
శూన్యంబులై యుండె; నయ్యవసరంబున.

89


సీ.

కమలజామరదైత్యగంధర్వకిన్నర
         యక్షపన్నగమనుష్యాధిపతులు
పశుపక్షికీటకప్రతతులు జంగమ
         స్థావరాత్మకమైన జగము లెల్ల
నతిదరిద్రత నొంది యాఁకటఁ గడు డస్సి
        కూడు చీరలు లేక కుంద దొణఁగె;
వానలు గురియక వట్టిజలాశయం
       బులు సర్వతరువనంబులును నెండె;


తే.

నఖిలజనమును నిర్వీర్య మయ్యెఁ గ్రతువు
లణఁగె సర్వంబు శూన్యమై యవని చెడియె
మునిమహత్త్వంబు పెంపున మూర్తి సడలి
యమ్మహాలక్ష్మిచూ పెడయైనకతన.

90
  1. వాసవునిని (ము)
  2. నన్నింత (మ-తి), నిన్నింత (హై)
  3. శాపం బిచ్చి కదలిన న య్యింద్రుండును (హై)
  4. నెద్దేవుని (ము)