పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/267

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-షష్ఠాశ్వాసము

235


వ.

ఇట్లు షోడశవర్షసమానవయస్కుండును నఖిలజగన్మోహనాకారుం
డును యోగిజనహృదయగమ్యుండునునై సుఖాసీనుండగు నద్దేవు
వామాంకంబున శీలరూపవయోగుణంబుల సమానయై కనక
చంపకప్రసూనప్రతిమానశరీరయు సర్వలక్షణసంపన్నయు
దివ్యాంబర[1]స్రగ్గంధభూషణాలంకారయు ముక్తాఫలకనక
[2]కమలమాలావిభూషితయు వసుపాత్రమాతులుంగదర్పణాం
బుజహస్తచతుష్టయము భక్తజనాభీష్టదాయినియు నగు కమ
లాలయ సుఖాసీనయై యుండు మఱియు నద్దేవియంశంబు
దాల్చి ముకుందునిం బరివేష్టించి.

51


తే.

వఱలు జాహ్నవి పద్మయవాచ్ఛయీశ
సరసిజాలయ సావిత్రి సర్వగమన
యన మహాదేవి యనఁ బేర్చి యష్టశక్తు
లై భజింతురు చామరహస్త లగుచు.

52


వ.

మఱియును శ్రద్దయు మేధయుఁ బ్రజ్ఞయు ధారుణియు శాంతియు
శ్రుతియు స్మృతియు ధన్యయు వృద్ధియు మనీషయు ననువీరలు
మొదలుగాఁ గల దాసీజనంబులును, అనంత గరుడ విష్వక్సేనాది
కింకరులును, సంధ్యా మరుద్గణాది దేవతులును, యోగివరులును
మూర్తిమంతులై యజ్జనార్దనుం గొలిచి నిత్యసుఖులై యుండు
దురు మఱియును.

53


ఆ.

విష్ణుభక్తిలేని వేదయజ్ఞవ్రత
దాననిరతులైన ధన్యులైనఁ
బొందలేరు విష్ణుభువనంబు హరిసేవ
గలుగువారి కచటఁ గలుగు నబల!

54


మ.

హరినామంబులు భక్తిమైఁ దలఁచి నిత్యంబు న్మహానిష్ఠతో
హరిపూజారతులై యనన్యహృదయవ్యాపారులై సర్వమున్
హరియాయత్తము చేసి సత్త్వమతులై యద్దేవుపాదాబ్జత
త్పరులై యుండెడువారు తత్పదమునం బ్రాపింతు రబ్జాననా!

55
  1. సద్గంధ (తి)
  2. కమలావిభూతియు (ము)