పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/266

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

234

పద్మపురాణము


సీ.

బహురత్నభూషణప్రభలఁ జెన్నమరెడు
         మానితదివ్యవిమానములను
నిత్యయౌవనముల నిత్యులై సంపదఁ
         బెంపారి వర్తించు దంపతులను
బటు[1]భద్రగోపురప్రాసాదతతులను
         మానైన యప్పురీమధ్యమునను
బాలార్కశతకోటిభాతి నక్కజమైన
         రత్నహాటకచిత్రరచన మెఱసి


తే.

లలితసౌగంధికామోదమిళిత మగుచు
దివ్యకాంతాసహస్రంబు తేజరిల్లు
సామగానంబు లులియంగ సౌమ్యలీల
రమణ నొప్పారు నంతఃపురంబు నడుమ.

48


వ.

దివ్యమణిస్తంభశోభితంబగు మండపంబున నుదయార్కసంకాశం
బగు సింహాసనంబునందు.

49


సీ.

సప్తకాంచనకాంతిఁ దనరు సౌమ్యాంగంబు
         వలుద ముత్యాలపేరులు దనర్పఁ
గటకకేయూరాదికలితహస్తంబులఁ
         జక్రాదిసాధనసమితి మెఱయఁ
గనకపంకజకాంతిఁ గనుపట్టు నడుగుల
         బహురత్ననూపురప్రభలు వెలుఁగ
నర్ధేందుగతి నొప్పు నలికంబు కుంకుమఁ
        గొమరారు నూర్ధ్వపుండ్రమున నొనరఁ


తే.

గర్ణకుండలమౌక్తికకమ్రరుచులు
గండమండలముల వింతకాంతిఁ జేయ
నమృతఫేనాంశురుచిరవస్త్రములు పూని
కనకపీఠంబుపై జనార్దనుఁడు వొలుచు.

50
  1. వప్ర (హై), వజ్ర (తి)