పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/262

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

230

పద్మపురాణము


చ.

చిలుకయు ధాన్యపాత్రికయుఁ జేతుల రెంట ధరించి రెంటఁ జెం
గలువలు గ్రాల దివ్యమణికాంచనభూషణచందనాంబరం
బులు దగఁ బూని నీలమణిపుత్రికయో యన నాథుఁ జేరి పెం
పలరు వసుంధరారమణి యవ్విభు[1]చూడ్కికి నక్కజంబుగన్.

30


క.

విమలాదులైన శక్తులు
సమధికవిభవమునఁ జేరి చామర లిడఁగాఁ
గమలాక్షుఁ డొప్పు మెఱుఁగుల
గమినడుమఁ జెలంగు నీలకంధర మనఁగన్.

31


ఆ.

నిత్యముక్తు లధికనిరతు లష్టాక్షర
మంత్రసిద్దు లెలమి మరగి కొలుతు
రిన్ని చెప్పనేల? యెపుడుఁ బరమపద
మందుఁ గలుగువార లెందుఁ గలరు.

32


వ.

అని ప్రథమవ్యూహవిశేషంబుఁ జెప్పి మఱి ద్వితీయవ్యూహంబు
చెప్పెద నాకర్ణింపుమని ప్రమథనాథుండు పార్వతి కిట్లనియె.

33


సీ.

నిఖిలలోకంబుల నిత్యమై వైష్ణవం
        బనుపేర నొప్పారు నచట వినుము
శుద్ధసత్త్వంబును శుభదంబు దివ్యంబు
       నమృతమయంబును నై వెలుంగు
దిననాథశతకోటిదీప్తమై పొలుపారు
       నజభవాదుల కంద నలవిగాదు
కనకమయంబైన కల్పవృక్షంబుల
      నమృతంపునదులను నమరియుండు.


తే.

కొమరు మిగిలిన వైడూర్యకుట్టిమముల
మణివిరాజితమగు హేమమందిరములఁ
బసిఁడికోటల గోపురప్రాంగణముల
నమరు నచ్చటు వర్ణింప నలవి యగునె?

34
  1. మాడ్కికి (ము)