పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-షష్ఠా శ్వాసము

223


తే.

పంకజోదర! బలరామ! పద్మనాభ!
వాసుదేవ! సంకర్షణ! వారిజాక్ష!
యాదిమధ్యాంతరహిత! యనాదిపురుష!
[1]నిర్గుణాత్మక! భవ! యపవర్గఫలద!

4


క.

సుజ్ఞానరూప! నిరుపమ
యజ్ఞపురుష! యజ్ఞభోక్త! యజ్ఞాంగ! మహా
ప్రజ్ఞానురక్త! జయస
ర్వజ్ఞ! జగన్నాథ! విబుధవంద్య! మురారీ!

5


తే.

నీకు మ్రొక్కెద హరి! కృష్ణ! నీలవర్ణ!
నీకు మ్రొక్కెద నత్యంతనిర్గుణాత్మ!
నీకు మ్రొక్కెద భువనైకనిబిడరూప!
నీకు మ్రొక్కెద లోకేంద్ర! నీరజాక్ష!

6


క.

పంచనవవ్యూహంబులు
సంచితవేదములు నీవ! యనిశము నిను సే
వించెద! నన్నుఁ బ్రసన్నో
దంచితమతిఁ జూడు మురుదయారసమూర్తీ!

7


వ.

దేవా! సర్వలోకోపకారార్థంబుగా నావిన్నపం బవధరింపుము.

8


శా.

నాయందున్న సమస్తజంతుతతి దైన్యంబొంది[2]పెంపేది తా
నాయుశ్శ్రీవిముఖాత్మమై విగతకర్మారంభమై శూన్యమై
యేయాధారము లేకయున్నయది దా నివ్వేళ నాకై తగన్
నీయారూఢదయార్ద్రదృష్టి యిచటన్ నెక్కొల్పవే కేశవా!

9


వ.

[3]ఈ ప్రకారంబున నాభువనంబు సృజియించి స్థావరజంగమం
బులకుఁ జేతనంబు గలిగింపుము. ధర్మాధర్మంబులును సుఖక్లేశం
బులును నీకటాక్షంబునన సంభూతంబు లగు నట్లగుటం జేసి నా
యందుఁ బొంది యింతయు నుద్దరింపుము.

10
  1. నిర్గుణాకార (మ-తి-హై)
  2. పెంపొంది (ము)
  3. పూర్వప్రకారంబు భువనంబు లన్నియు (తి-హై)