పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-పంచమాశ్వాసము

209


దులు పరివర్తించుకాలంబులం జేసి జగంబు లుత్పత్తిస్థితిలయం
బులం బొందుచుండు నక్కాలంబులు చతుర్యుగంబులును ద్వి
సహస్రపరివర్తనంబులం గమలగర్భున కొక్కదినంబగు. అట్టి
దినంబులు ముప్పది మాసంబగు. అట్టి మాసంబులు [1]పండ్రెండు
నొక్కసంవత్సరం బగు. అట్టి సంవత్సరంబులు నూఱు చనిన
బ్రహ్మకల్పం బగు. ఆసమయంబున సృష్టిసంహారం బగును.
అప్పుడు బ్రహ్మాండాంతర్గతంబులగు లోకంబు లన్నియుఁ గాలాగ్ని
చేత దహింపంబడి సర్వాత్మకుండగు విష్ణునందుఁ బ్రవేశించి
యావరణభూతంబునందు లీనంబగు. అట్టి సర్వజగదాధార
భూతంబగు మూలప్రకృతి హరి నాశ్రయించియుండ నమ్మాయ
చేత జగదుద్భవసంహారంబు లాహరి యొనరించుచుండు. మఱి
యవిద్య ప్రకృతి మాయ గుణత్రయ సృష్టి హేతుభూత సనాతన
యోగనిద్ర మహామాయ యనంబరఁగు నామంబులంగల ప్రకృతి
స్థానంబై నిబిడాంధకారంబై యవ్యయంబై విలసిల్లుచుండు.

128


సీ.

పాదవిభూతి నాఁ బరఁగు నా ప్రకృతికి
        విరజానదియ మీఁదఁ బరఁగు సీమ
క్రిందు నిస్సీమమై రెండు పక్కంబుల
        నింతింత యనరాక యెసక మెసఁగ
నల్పమై యధికమై యఖిలజగంబులు
        నంద యుద్భవ మొంద నంద[2]యడఁగఁ
గోరి వికాససంకోచకాలంబుల
       నుత్పత్తిలయముల నొందు జగము


తే.

దగిలి భూతము లెల్ల నంతర్గతంబు
లగుచు శూన్యంబులై తోఁచు నట్లు గానఁ
బ్రాకృతములగు రూపు లా ప్రకృతిరూప
కా నెఱుంగుము చెప్పెదఁ గమలనయన!

129
  1. ద్వాదశమాసంబులు సంవత్సరంబగు (ము)
  2. డిందఁ (తి-హై)