పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-పంచమాశ్వాసము

207


సీ.

శ్రీదేవి కమల లక్ష్మీదేవి హరిపత్ని
         సకలభూతేశ్వరి సత్యమాత
సతి నిత్యశివ సర్వగత వుష్టి రమ లోక
        మాత మహాదేవి సీత దివ్య
సర్వసుఖప్రద శచి వేదవతి గౌరి
       రుక్మిణీదేవి క్షీరోదతనయ
యతులకారుణ్యవరారోహ నారాయ
       ణీ మనోశుభకాంతి నీలభూమి


తే.

యఖిలకల్యాణి స్వాహా స్వధాత్మ యనఁగ
హరికి నిత్యావపాయినియైన దేవి!
పుణ్యనామస్తవం బిది పొరిఁ బఠింప
భూరిసంపద లొనఁగూడు నేరికైన.

121


వ.

మఱియు వాక్సంహితాసూక్తంబుల స్తుతియింపంబడు బ్రహ్మాది
దేవతలకు నధికైశ్వర్యసుఖంబు లొసంగుచుఁ దన యపాంగం
బులా నఖిలస్థావరజంగమాత్మికం బగు జగంబు నాశ్రయించి
యుండు నమ్మహాలక్ష్మి [1](యగ్నియందు ప్రభయును)
చంద్రునియందుఁ గళయునుం బోలె నద్దేవుని వక్షంబున నన
పాయినియై విహరించుచుండు నద్దేవుండు.

122


సీ.

సర్వేశ్వరుఁడు [2]సర్వశక్తిసమేతుండు
        సదయుండు వాత్సల్యసాగరుండు
శ్రీమంతుఁ డధికసుశీలుండు సుభగుండు
        సంపూర్ణకాముఁడు సర్వసులభుఁ
డవ్యయాత్ముండు నారాయణుఁ డపవర్గ
        సుఖదుండు నిత్యుండు సఖుఁడు గురుఁడు
కరుణాకరుఁడు సర్వగతుఁ డనంతుఁడు పురు
        షోత్తముఁ డురుదయాచిత్తుఁ డనఘుఁ

  1. అధికపాఠము (మ-తి-హై)
  2. శక్తి సహజసమేతుండు (ము)